Wednesday, April 30, 2025

యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టులో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, వీర్లపాలెంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులోని యూనిట్ 1లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ నుండి ఆయిల్ లీకేజీ జరిగి మంటలు చెలరేగటంతో యూనిట్ వన్ పాక్షికంగా దెబ్బతిన్నది. వచ్చే నెలలో యూనిట్ వన్‌ను ప్రారంభించనుండగా అందుకుగాను అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియలో అర్ధరాత్రి ఆయిల్ లీక్ కావటంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే ఫైర్ ఇంజన్లను పిలిపించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇతర విభాగాలలో ఉన్న సిబ్బంది కూడా సహకారం అందించడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండానే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై జెన్కో అధికారులు పూర్తిగా ధృవీకరించలేదు. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమేనని అధికార వర్గాలు వెల్లడించాయి. జరిగిన ప్రమాదం ద్వారా లోపాలను గుర్తించి, వాటిని వీలైనంత తొందరగా సరిచేసి తిరిగి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News