తమిళనాడు లోని శివకాశీ బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఆర్. మహాలింగం, సి. చెల్లపాండియన్, కె. లక్ష్మి, ఆర్. రామమూర్తి, ఆర్. పుణ్యమూర్తి, కె. రామజయం, ఎం. నాగపండి, జి. వైరమణి గా గుర్తించారు. గాయపడిన వారిలో ఐదుగురు శివకాశీ, మదురై ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ ప్రమాద వార్తకు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర సంతాపం చెందారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల వంతున నష్టపరిహారం ప్రకటించారు.
అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున సహాయం ప్రకటించారు. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి బాణాసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడంలో రాప్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేలుడులో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని వ్యాఖ్యానించారు.