మన తెలంగాణ/ హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి బత్తిని కుటుంబ సభ్యులు, నిర్వాహకులలో ఒకరైన బత్తిని గౌరీ శంకర్ సోమవారం తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై వారిరువురు చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ బత్తిని కుటుంబం చేపడుతున్న చేప మందు పంపిణీ కార్యక్రమం లక్షలాది ప్రజలకు ఉపయోగపడుతున్న సేవా కార్యక్రమం అని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇది ప్రజారోగ్య ప్రయోజనంతో కూడిన విశిష్టమైన సంప్రదాయమని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు తాగునీరు, షెడ్లు, వైద్య సహాయం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో సహకరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.