Saturday, August 23, 2025

చేపల వ్యర్థాలతో వ్యవసాయ విప్లవం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే చేతిలో ఆధార్ కార్డులు, అప్పోసప్పో చేసి సేకరించుకున్న డబ్బులతో రైతులు ఎరువుల దుకాణాల ముందు రోజుల తరబడి నిద్రాహారాలు మానుకుని కునికిపాట్లుపడుతూ ఎంతకూ తమదాకా రాని యూరియా బస్తాలకోసం పడిగాపులు పడుతున్న విజువల్స్, వీరితో పోటీపడుతున్న పద్ధతిలో పత్రికలు, మీడియా ఛానళ్ల నిండా ఎరువుల కొరతకు సంబంధించిన రాజకీయ ఏడుపులు పెడబొబ్బలు, ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతి ఏటా వర్షాకాలం సీజన్ లాగానే సర్వసాధరణమైపోయాయి.

కేంద్రం ఇవ్వడంలేదని రాష్ట్రం లో అధికారంలో ఉన్న పాలక పార్టీలు, ఇచ్చిన ఎరువులను రైతులకు పంపిణీ చేయడంలేదని కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న (Power shining) పార్టీలు, సందట్లో సడేమియాల్లాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ దోబూచులాటను రక్తికట్టించడంలో ఆరితేరిన ఇతర పార్టీల నేతలు.. మొత్తంగా రైతులకంటే రాజకీయ నాయకులకే ఖరీఫ్ సీజన్ ఎక్కువ పంటలను చేతికందిస్తున్నది. రైతులపేరిట దశాబ్దాల తరబడిగా రాజకీయ పార్టీలు, వాటికి నాయకత్వం వహించే నాయకులు క్రమం తప్పకుండా ఒక ప్రకృతి ధర్మంగా వచ్చిపోయే సీజన్ లా పరిపాటయింది.

కానీ, వరంగల్లు మహానగర పరిధిలోని గొర్రెకుంటకు చెందిన మహిళా మత్స్యకారుల ప్రాథమిక సహకార సంఘం సభ్యులు మాత్రం చేపల వ్యర్థాలనుండి సేంద్రియ ఎరువులను తయారుచేసే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి చరిత్రపుటల్లో నిలిచిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరకాలంలో ‘ప్రకృతి పర్యావరణ సంస్థ’ ఆధ్వర్యంలో వీరు నిర్వహిస్తున్న ప్రయోగాలు ఆందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలను సాధించి, స్థానిక రైతులు ప్రయోగాత్మకంగా తమ పంటచేనుల్లో వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలను సాధించారు. 2025 ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్రంలో 10.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉండగా, కేంద్రం కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి.

గత సంవత్సరం రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు నిర్వహించగా, ఈ సంవత్సరం సుమారు 45 లక్షల ఎకరాలకు ఈ సాగు విస్తీర్ణం పెరిగిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 98.0 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులో ఇప్పటివరకూ కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే విడుదల చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత కారణంగా రైతులు ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు పడవలసిన దుస్థితి ఎదురవుతున్నది. అయితే, ఈ సంక్షోభానికి ఒక కొత్త, వినూత్న పరిష్కారం వెలుగులోకి వస్తోంది.

రైల్వే వ్యాగన్ల కోసం, సబ్సిడీల కోసం ఎదురుచూడకుండా, స్థానికంగా లభ్యమయ్యే వనరుల నుంచే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చని కందుల కళావతి నాయకత్వంలోని ‘గొర్రెకుంట మహిళా మత్స్య సహకార సంఘం’ నిరూపిస్తోంది. అదే, చేపల వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే ఒక సరికొత్త విధానం. ఈ ప్రాజెక్ట్ చాలా సరళమైన సూత్రంపై ఆధారపడి ఉంది: చేపల వ్యర్థాలైన తలలు, ఎముకలు, ప్రేగులను బెల్లం, ఇతర పదార్థాలతో కలిపి పులియబెట్టడం. సుమారు 40 రోజుల తర్వాత, ఇది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి కీలక పోషకాలతో కూడిన శక్తివంతమైన ద్రవ ఎరువుగా మారుతుంది. పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్శిటీ పరిశోధనలు కూడా దీని సామర్థ్యాన్ని ధ్రువీకరించాయి. ఈ విధానం కేవలం ఎరువుల కొరతను తీర్చడం మాత్రమే కాదు, ఇది వ్యవసాయ, మత్స్యరంగాల మధ్య కొత్త అనుబంధాన్ని, సహకారాన్ని పెంచుతుంది.

మత్స్యకారులు తమ చేపల వ్యర్థాలను కమ్యూనిటీ సహకార సంఘాలకు అమ్మి కొత్త ఆదాయాన్ని పొందవచ్చు. ఈ సంఘాలు పులియబెట్టే ప్రక్రియను నిర్వహించి, ద్రవఎరువును రైతులకు అందిస్తాయి. ఈ పద్ధతి వల్ల రైతులు రసాయనిక ఎరువులపై ఆధారపడటం తగ్గుతుంది. అంతేకాకుండా, ఈ సేంద్రియ ఎరువు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, భూమిలో సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. తెగుళ్ళను నివారించే సహజ సమ్మేళనాలు ఇందులో ఉండటం వల్ల పురుగుమందుల వాడకం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ విధానం పర్యావరణపరంగా కూడా ఎంతో ప్రయోజనకరం. ఈ వినూత్న ఆలోచనను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి తెలంగాణ సహకార వ్యవస్థ ఒక బలమైన వేదికగా నిలుస్తుంది.

టిఎస్‌ఎఫ్‌సిఒఎఫ్, మార్క్‌ఫెడ్, ప్యాక్స్ వంటి సంస్థలకు ఇప్పటికే రైతులపై అపారమైన విశ్వాసం ఉంది. ఈ సంస్థలు చేపల వ్యర్థాల సేకరణ కేంద్రాలుగా పనిచేసి, వాటిని విలువైన వనరులుగా మార్చగలవు. తద్వారా స్థానిక నిపుణులకు శిక్షణ ఇచ్చి, నాణ్యతను నిర్ధారించి, రైతులకు సరసమైన ధరలకు ఈ ద్రవ ఎరువులను పంపిణీ చేయవచ్చు. ఈ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే బయో-ఎరువులను పొరుగు రాష్ట్రాలకు విక్రయించడం ద్వారా సహకార సంఘాలు అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ మార్గంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, అవి అధిగమించలేనివి కావు. ప్రభుత్వ విధానాల ప్రోత్సాహం, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయవచ్చు. ఇప్పటికే వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన పైలట్ అధ్యయనాలు దీని సానుకూల ఫలితాలను చూపించాయి.

చేపల ద్రవ ఎరువు వాడిన వరి పొలాల్లో 8- 12% దిగుబడి పెరగడం, కీటకాల నష్టం 20% తగ్గడం వంటి గణాంకాలు ఈ విధానం కేవలం ఒక ఆశయం మాత్రమే కాదని, ఆచరణ సాధ్యమైన పరిష్కారమని రుజువు చేశాయి. ఎరువుల కొరతపై రాజకీయ వివాదాలు, సబ్సిడీల కోసం వేడుకోలు ఇకపై పరిష్కారం కాదు. స్థానికంగా ఉన్న వనరులనే సంపదగా మార్చుకోవడం ద్వారా మాత్రమే నిజమైన స్వావలంబన సాధ్యమవుతుంది. చేపల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతోంది. ఇది కేవలం ఒక కొత్త ఉత్పత్తి గురించి కాదు, ఒక కొత్త ఆలోచనా విధానం గురించి. ఇతరులు పారవేసిన వాటి నుంచి జీవశక్తిని సృష్టించగల ఒక సంఘం యొక్క పటిష్టతను ఇది నిరూపిస్తుంది. నిజమైన స్థిరత్వం సబ్సిడీలలో కాకుండా, సమాజం స్వయంశక్తిలోనే ఉందని ఇది చాటిచెబుతోంది.

  •  పిట్టల రవీందర్
    (తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్
    పూర్వ అధ్యక్షులు)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News