ఝార్ఖండ్లో భారీ వర్షాల బీభత్సంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. అనేక మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం 8.30 వరకు పాలము, గర్హా, ఛత్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లాతేహర్, రాంచి, కుంటి, లోహర్డాగా, సెరైకెల ఖర్సవాన్, తూర్పు, పశ్చిమ సింఘ్భూం జిల్లాలకు ఆరంజ్ హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం రాత్రి సెరైకెల జిల్లాలో రాజానగర్ బ్లాక్ లోని దండు గ్రామంలో ఇల్లు కూలి ఒకామె తన ఏడేళ్ల కొడుకు చనిపోయారని అధికారులు తెలిపారు. సంతోష్ లోహార్కు చెందిన ఇల్లు కూలి ఎనిమిది మంది గాయపడ్డారు. లోహార్ ఇంటికి బంధువులు వచ్చిన తరువాత ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఈ జిల్లాలోని కోల్ సిమ్లాలో మున్నా బోడ్రా ఇంటి గోడ కూలి ఐదేళ్ల బాలుడు చనిపోగా, మరోముగ్గురు గాయపడ్డారు.
ఛత్ర జిల్లా కట్ఘర గ్రామంలో సియారీ నది ఉప్పొంగి దంపతులు కొట్టుకుపోయారు. వీరిలో భర్త మృతదేహం దొరకగా, భార్య మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఖైరతోల గ్రామంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గత 24 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. రాంచీలో పిస్కా స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వేబ్రిడ్జి కాంక్రీట్ స్లాబులు కూలిపోవడంతో భారీగా జాతీయ రహదారి (43) పై ట్రాఫిక్ స్తంభించింది. రాంచీ లోని బ్రాంబే బజార్ వద్ద జాతీయ రహదారిపై నీరు నిల్చిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పంచశీల్ నగర్, హిండిపిర్, మొరాబాడి, కోకర్, నంకుం, న్యూబంధ్గరి, సమ్లాంగ్, తదితర లోతట్లు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
ప్రమాద స్థాయిని దాటిన నదులు
జెంషెడ్పూర్ లోని మాంగో బ్రిడ్జి వద్ద సుబెర్నరేఖ నది ఆదిత్యపూర్ బ్రిడ్జి వద్ద కూడా ఖార్ఖాయి నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. వివిధ నదులు ప్రమాదస్థాయి మించి ప్రవహిస్తుండటంతో లోహర్గాడ లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. కొడెర్మా జిల్లాలో తిలైయా డ్యామ్ నీరు ప్రమాద స్థాయిని దాటడంతో 8 గేట్లు తెరిచారు. అల్పపీడన ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని రాంచీ వాతావరణ కేంద్రం ఇన్ఛార్జి బాబూ రాజ్ పిపి చెప్పారు. ఆగస్టు 29 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. లాతేహర్చంద్రాలో శనివారం ఉదయం 8.30 వరకు రాష్ట్రం మొత్తం మీద అత్యథికంగా 205 మిమీ వర్షం కురిసింది. సెరైకల లో 146 మిమీ, రాంచీలో 120 మిమీ, చాయిబసాలో120 మిమీ వర్షం నమోదైంది.