పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి
సనత్‌నగర్‌లోని ఆస్పత్రిని జూన్ 2వ తేదీన ప్రారంభించాలని
ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది
వెంటనే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల (five super specialty hospitals) నిర్మాణం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సచివాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, హరిచందన, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల (five super specialty hospitals) నిర్మాణం ఆలస్యం అవుతుండడంపై అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
అయితే నిర్మాణాలకు సంబంధించి కుంటిసాకులు చెబుతూ ఆలస్యం చేస్తుండడంపై ఆయన అధికారులపై మండిపడ్డట్టుగా సమాచారం. అయితే, సనత్‌నగర్‌లోని ఆస్పత్రిని జూన్ 2వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందని పనులు ఎందుకు వేగంగా కొనసాగడం లేదని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించినట్టుగా సమాచారం. ఎప్పటి వరకు 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం పూర్తి చేస్తారో టెక్నికల్ గా అంచనా వేసి రిపోర్ట్ ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఇక, ఆసుపత్రులకు సంబంధించిన నిర్మాణ పనులను ఆర్ అండ్ బి, వైద్య పరికరాలను వైద్యఆరోగ్య శాఖ ఎస్టీమేట్ వేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ప్రతి వారం ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై సమీక్ష చేస్తానని మంత్రి కోమటిరెడ్డి అధికారులతో పేర్కొన్నట్టుగా తెలిసింది.