కుర్తి బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
పిట్లం, కల్హేర్ మధ్య రాకపోకలకు అంతరాయం
ఉదృతంగా ప్రవహిస్తున్న కాకి వాగు
మన తెలంగాణ/పిట్లం: పిట్లం మండల పరిధిలోని కుర్తి గ్రామం బుధశారం సాయంత్రం నుంచి గురువారం వరకు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండటంతో గురువారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బ్రిడ్జిపై నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు బుధవారం రాత్రి వదలడంతో నీరు కుర్తి గ్రామం హై లెవల బ్రిడ్జి పై నుంచి ప్రవహించడంతో బుధవారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ ప్రజలకు ఏమైనా సమస్యలుంటే మండలాధికారులకు తెలియపర్చాలని తెలిపారు. ఆయా గ్రామాల్లో భారీ వర్షాలకు వాగులు, చెరువులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాంపూర్ వాగు, తిమ్మానగర్ కాకి వాగు, నల్లవాగు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు, అలుగులు పారుతున్నాయి. మండల కేంద్రంలోని నేతాజీ నగర్ కాలనీలో సాయాగౌడ్ అనే వ్యక్తి ఇండ్లు వర్షానికి పాక్షికంగా కూలిపోయింది. వర్షాభావ పరిస్థితులను సబ్ కలెక్టర్ కిరణ్మయితో పాటు మండల తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, మండల అభివృద్ది అధికారి రఘు, గిర్దావర్ శీతల్, ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.