Saturday, September 13, 2025

పాలకుల అవినీతే అసలు కారణం

- Advertisement -
- Advertisement -

నేపాల్‌లో గత మూడు రోజుల క్రితం జరిగిన ఘటనలు మొత్తం ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. శాంతియుత ప్రదర్శన హింసాయుతంగా మారడం, కాల్పులు జరగడం, మరోసటి రోజు అది ఖాట్మండులోని అతి ముఖ్యమైన భవనాలు, వ్యాపార, మీడియా సంస్థలు సైతం అగ్గికి ఆహుతి అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆందోళన కలిగించింది. నేపాల్‌లో చెలరేగిన హింస యువతరం, కోపానికి, అసంతృప్తి నుంచి పుట్టిందని అందరం భావిస్తున్నాం. అయితే ఇది పైకి కనిపించే అంశమే. యువతరం తాము ఆవేశాన్ని ఒక నిరసన ప్రదర్శన వ్యక్తం చేయాలనుకున్న మాట వాస్తవమే. కానీ కాల్పులు విద్యార్థులు, యువకుల మరణం, దాని పర్యవసానంగా చెలరేగిని హింస, ధ్వంసం, దౌర్జన్యం, లూటీలు, దాడులు యువతరం ఊహించ లేదు. అదే నిజమైతే అది ఎలా జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం.

నేపాల్‌లో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఈ రోజు జరిగిన దుస్సంఘటనకు కారణం. నేపాల్ పరిమిత వనరులున్న చిన్నదేశం. నేపాల్‌లో మూడు భాగాలున్నాయి. ఒకటి మంచు పర్వతాలతో ఉన్న హిమాలి ప్రాంతం. రెండోది పహడిశా పిలువబడే పర్వత ప్రాంతం. మూడోది భారత భూభాగంతో కలిసి ఉన్న మైదాన ప్రాంతం. దీన్ని మదేశి అని గానీ, తరాయి అని గానీ పిలుస్తారు. హిమాలి ప్రాంతంలో ఎక్కవగా బౌద్ధులు, కొన్ని ఆదివాసీ తెగలు, దళిత జాతులుంటాయి. ఈ ప్రాంతం విస్తీర్ణం కలిగి ఉన్నప్పటికీ, ఉపాధికి పనికి వచ్చే వనరులు తక్కువ. రెండోది పహడి ప్రాంతం ఇది నేపాల్‌లో మధ్య భాగం. దేశ రాజధాని ఖాట్మండు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం నేపాల్‌కు గుండె కాయ. ఈ దేశంలోని బ్రాహ్మణ, క్షత్రియ, ఇతర సంపన్న వర్గాలు ఈ ప్రాంతలలోనే వుంటాయి. మూడోదైన మదేశి ప్రాంతం భారతలో ఉన్న సామాజిక చరిత్రకు దర్శనమిస్తుంది.

ఈ నేపాల్‌లో హిందూ మత సాంప్రదాయుత ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆ తరువాత 10 శాతంగా బౌద్ధులు వస్తారు. అయితే భారతదేశంలో ఉన్న స్థితిగతులే ఇక్కడ ఉంటాయి. గత ముప్పై, నలభై ఏళ్ళలో చదవుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఆధునికి సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకించి ఇంటర్నెట్, సోషల్ మిడియా ఉపయోగం బాగా పెరిగింది. కానీ ఉద్యోగాలు లేవు. ఉపాధి అవకాశాలు తక్కువ. నిరుద్యోగం మరెన్నడు లేనంతగా పెరిగిపోయింది. 2022 23 లెక్కల ప్రకారం 15 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల వయస్సు వరకు నిరుద్యోగుల శాతం 34.2 అంటే ఎంత తీవ్రంగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో పేద కుటుంబాలలో నుంచి వచ్చిన వాళ్ల నిరుద్యోగాల శాతం ఎక్కువ. పేదలు 17.2 శాతం నిరుద్యోగులుగా ఉంటే, ధనికులు 8.5 శాతం మాత్రమే. పాఠశాల స్థాయిలో విద్యను పొందిన వాళ్ళలో 18.2 శాతం ఉంటే, గ్రాడ్యుయేట్స్‌గా ఉన్న వాళ్ళలో 6.3 శాతం మాత్రమే.

ఖాట్మండు లోయ 7.6 శాతం నిరుద్యోగులుంటే , గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఆ శాతం 20. దీని పర్యవసానంగా నేపాల్ నుంచి వలస వెళుతున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగింది. 1995-96లో 13.5 శాతం ఉంటే, అది 202223 వచ్చే సరికి దాదాపు మూడింతలు పెరిగి 37.1 శాతంగా మారింది. ఇది కూడా ఖట్మండు లోయలో 8.7 శాతం అంటే, గ్రామీణ ప్రాంతాల్లో 56 శాతం మగవాళ్ళ బయట దేశాలకు వలస వెళుతున్నారు. పేదరికంలో ఉన్న వాళ్లు దాదాపు 42 శాతంగా ఉన్నారు. వీటిన్నింటికి కారణాలలో ఒకటైన ఆర్థిక వ్యవస్థ బలమైనది కాదు. నేపాల్‌లో వ్యవసాయ యోగ్యమైన భూమి కేవలం 20 శాతం మాత్రమే. వ్యవసాయంతోపాటు వాళ్ళ ఆర్థిక వనరులు, జల విద్యుత్ ఉత్పాదన, వస్త్ర పరిశ్రమ, ఇతర చిన్నచిన్న వస్తు ఉత్పత్తులు. దానితోపాటు పర్యాటకం. అయితే జనాభా కూడా 2024 ప్రకారం దాదాపు 3 కోట్లు. ఇటీవల నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత్వం వల్ల అంటే 1990 నుండి ఇప్పటి వరకు 26 సార్లు ప్రభుత్వాలు మారిపోయాయి.

దీనితో కూడా ప్రభుత్వాలకు సరైన సమయం చిక్కలేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు చూపిన శ్రద్ధ కూడా తక్కువ. ఈ కారణాల వల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి పెరిగింది. దీనికి తోడు ఇటీవల మరొక ధోరణి బయటకు వచ్చింది. చాలా ఉద్యమాలు ప్రత్యేకించి మావోయిస్టు సాయుధ పోరాటాల అనంతరం ప్రజాస్వామ్య రాజ్యాంగాని ఏర్పరచుకోవడానికి నేపాల్ ప్రజలు ప్రయత్నించారు. అది 2015, సెప్టెంబరు 20వ తేదిన ఆమోదించుకున్నారు. భారత రాజ్యాంగం స్ఫూర్తితో అనేక అంశాలను అందులో పొందుపర్చుకున్నారు. అయితే ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఇటీవల ప్రజాస్వామ్య వ్యవస్థ విఫలమైందని, రాజు ప్రధాన అధిపతిగా ఉండే రాచరికమే మేలనే ఉద్యమం మొదలైంది. అంతేకాకుండా, నేపాల్‌ను సెక్యులర్ దేశంగా కాకుండ హిందూ దేశంగా ప్రకటించాలనే నినాదం ఊపందుకున్నది. ఈ ఉద్యమం వెనుక రాజు కుటుంబం, సైన్యంలోని ప్రధాన అధికారులందరూ ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం జెన్ జెడి ఉద్యమాన్ని పరిశీలించాలి.

యువతరం గత కొంత కాలంగా ప్రభుత్వాధినేతలు, ప్రత్యేకించి రాజకీయ పార్టీల అధినేతల అవినీతి పెరిగిపోయిందని, వాళ్ళ విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తుంటే, తాము నిరుద్యోగంతో దుర్భర జీవితాలను గడుపుతున్నామని భావన పెరిగింది. ఈ సందర్భంలోనే ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్నది. గత సంవత్సరం నేపాల్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ ఫారంలన్నీ విధిగా దేశంలో రిజిష్టర్ చేసుకోవాలని, ఒక బాధ్యత కలిగిన అధికారిని నియమించాలని, ఏవైనా ఫిర్యాదులుంటే ఆ అధికారి పరిష్కరించే కర్తవ్యం ఉండాలని ప్రభుత్వం అన్ని కంపెనీలకు ఆగస్టు 28వ తేదిని ఒక నోటిసు పంపింది. అయితే చాలా సంస్థలు, కంపెనీలు ప్రభుత్వ నోటీసును పట్టించుకోలేదు. అందులో ప్రధానమైన వాట్సాప్, ఫెస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం కూడా ప్రభుత్వ నోటీసుకు స్పందించలేదు. వారం రోజుల గడువు ముగియడంతో దరఖాస్తు చేసుకోని సంస్థలన్నింటినీ ప్రభుత్వం నిషేధించింది. అయితే టిక్ టాక్, వైబర్, వింబజ్, విట్క్, పొపొ లైవ్ లాంటి సంస్థలు స్పందించి దరఖాస్తు చేసుకున్నందున వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే సెప్టెంబర్ 4వ తేది నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వేదికలను నిషేధించారు. ఇది ఖాట్మండు ప్రజలను, ప్రత్యేకించి యువతరాన్ని తీవ్రంగా కలవర పరిచింది. ఆవేశపరిచింది. ఎందుకంటే, వ్యాపారం, వ్యవహారం, స్నేహం, ప్రేమ, చదువు అన్ని కూడా వాటి ద్వారానే నడుస్తున్నాయి. నేపాల్‌లో ఫేస్‌బుక్‌ను ఒక కోటి ముప్పై అయిదు లక్షల మంది వినియోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రాంను ముప్పైఆరు లక్షల మంది వాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మీద ఉన్న కోసం, రెండో వైపు సోషల్ మీడియా నిషేధంతో కట్టలు తెంచుకుంది. దీనికి ‘హమి నేపాల్’ అనే సంస్థ స్పందించి సెప్టెంబర్ 8న నిరసన ప్రదర్శన చేయాలని పిలుపు నిచ్చింది. నిషేధం కాకుండా మిగిలిన టిక్‌టాక్ లాంటి వేదికల ద్వారా సెప్టెంబర్ 8న ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ప్రదర్శన శాంతియుతంగా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే పాఠశాలలు, కళాశాలల నుండి తమ స్కూల్ డ్రెస్‌లు వేసుకొని వచ్చారు. అయితే దీనిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే శక్తులు ప్రత్యేకించి రాజును వెనక్కు తీసుకురావాలనే శక్తులు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఈ ప్రదర్శనకు మద్దతు పలికాయి.

తమ నేతలను ఇందులో భాగస్వాములయ్యేటట్టు చేశారు. దీనితో శాంతియుతంగా జరగాల్సిన ప్రదర్శన దౌర్జన్యంగా మారడం, పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం ఇరవైమంది విద్యార్ధులు మరణించడం, విద్రోహశక్తులకు మరింత బలాన్ని ఇచ్చాయి. తెల్లవారి అంటే సెప్టెంబర్ 9వ తేదిన మరింత విధ్వంసం జరిగింది. చాలా స్పష్టమైన లక్షాలతో భవనాలను తగులబెట్టారు. కంటెపుర్ అనే మీడియా హౌస్‌ను కూడా తగలుబెట్టారు. తదనంతరం పరిస్థితులు మనం చూశాం. అయితే నేపాల్‌లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం వాటిని నిర్వహిస్తున్న పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడబోయే తాత్కాలిక ప్రభుత్వ మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడానికి దోహదం చేస్తుందని ఆశిద్దాం. కానీ సైన్యం, రాజకుటుంబం, ఇతర మతతత్వశక్తులు నేపాల్‌ను భవిష్యత్‌లో కూడా అల్లకల్లోలం చేసే అవకాశముంది. నేపాల్‌లోని ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు వాటిని ఎదుర్కోవడానికి ఎటువంటి విధానాలు అవలంబిస్తారో వేచిచూడాలి.

Also Read : పసికూన ఓమన్‌పై గెలిచిన పాక్

  • మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News