పదవీ విరమణ చేసిన తరువాత కొనసాగుతున్న జస్టిస్ డివై చంద్రచూడ్
ఖాళీ చేయించి అప్పగించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ
త్వరలో ఖాళీ చేస్తా: చంద్రచూడ్ వివరణ
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను వెంటనే అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి తాఖీదు పంపించింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసం ఉంటుంది. ప్రస్తుత సిజెఐ ఈ నివాసంలో ఉండాలి. అయితే చంద్రచూడ్ ఇప్పుడు మాజీ సిజెఐ అయినప్పటికీ , ఇందులోనే కొనసాగడాన్ని సుప్రీంకోర్టు అధికారిక యంత్రాంగం తప్పుపట్టింది. ఆయన తనకు ఉండే నివాస గడువును మించి అక్కడనే ఉండటాన్ని తాము గుర్తించామని, ఖాళీ చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంబంధిత విభాగంపైనే ఉందని రిజిస్ట్రార్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఖాళీ చేయించాలనే విషయాన్ని సుప్రీంకోర్టు తమ లేఖలో కేంద్రానికి తెలిపింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వశాఖకు సుప్రీంకోర్టు లేఖ పంపించడం ఇప్పుడు అసాదారణం అయింది. చీఫ్ జస్టిస్ అధికారిక నివాసంగా బంగళా నెంబరు 5, కృష్ణ మీనన్ మార్గ్ ఉంటుందనే విషయాన్ని మంత్రిత్వశాఖ గుర్తించాల్సి ఉంటుందని లేఖలో తెలిపారు. ఇక ఎటువంటి జాప్యం లేకుండా మాజీ సిజెఐ ఈ నివాసం నుంచి వెళ్లిపోయ్యేలా చూడాలని మంత్రిత్వశాఖకు సూచించారు. ఏ సిజెఐ అయినా పదవీ బాధ్యతల నుంచి వైదొలిగిన తరువాత గరిష్టంగా ఆరు నెల లు తమ బంగళాలో ఉండటానికి వీలుంటుందని నిబంధనలు చెపుతున్న విషయా న్ని మంత్రిత్వశాఖ గుర్తుంచుకుని ,తగు విధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
కొద్దిరోజుల్లోనే ఖాళీ చేస్తా: డివై వివరణ
తాను త్వరలోనే పాత బంగళా ఖాళీ చేస్తానని, గడువు తరువాత ఉండరాదనే విషయం తెలుసునని జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చుకున్నారు. తన రిటైర్మెంట్ తరువాత తనకు ప్రభుత్వం అద్దె ప్రాతిపదికన యుపి సదన్ భవనం కేటాయించింది. అయితే రెండేళ్లుగా అ ది వాడకంలో లేనందున మరమ్మతులు అవసరం అ య్యాయి. పైగా తనకు ఇద్దరు దివ్యాంగులైన దత్త పుత్రికలు ఉన్నారని ,వారికి ఎయిమ్స్‌లో అరుదైన వ్యాధి సంబంధిత చికిత్స జరుగుతోందని చెప్పారు. మరమ్మతులకు కాంట్రాక్టర్ మరింత సమయం తీసుకుంటున్నందునే తాను పాత భవనంలో ఉంటున్నానని, తొందర్లోనే ఖాళీ చేస్తానని చంద్రచూడ్ స్పందించారు. చంద్రచూడ్ 2024 నవంబర్‌లో సిజెఐగా రిటైరయ్యారు.