తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్‌డి పేరుతో వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురిచేస్తున్న మాజీ రంజీ క్రికెటర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు ఆంధ్రా తరఫున రంజీ క్రికెట్ ఆడాడు. గతంలో ఎపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంను బెదిరించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. నాగరాజుపై ఎపిలో 16 కేసులు, తెలంగాణలో 13 కేసులు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు నిందితుడిపై జారీ చేసిన నాన్‌బెయిలబుల్ కేసు పెండింగ్‌లో ఉంది. నిందితుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్‌డి పేరుతో నకిలీ ఈమెయిల్, ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకుని వ్యాపారవేత్తలకు మెయిల్స్ పంపుతూ,
వాట్సాప్ కాల్స్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడు బొల్లినేని ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి కృష్ణమోహన్ బొల్లినేనికి revathreddyosd@gmail.com ద్వారా మెయిల్ పంపంచిడబ్బులు డిమాండ్ చేశాడు. ర్యాపిడో ఎండి అరవింద్ సంక, గుప్తా రియాల్టీ ఎండి గుప్తా శ్రీనివాస్ గుప్తా వీరబొమ్మ, కంట్రీ డిలైట్ ఎండిలు చక్రధర్, నితన్ కౌశల్ తదితరులకు ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారులు సిఎం ఓఎస్‌డి దృష్టికి విషయం తీసుకుని వెళ్లారు. తాము ఎలాంటి మెయిల్స్, ఫోన్ చేయలదని చెప్పడంతో పాటు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఇన్స్‌స్పెక్టర్ మట్టం రాజు, ఎస్సైలు శైలేంద్ర కుమార్, హిమా రెడ్డి, పిసిలు అశోక్, అజయ్ కుమార్ దర్యాప్తు చేశారు.