ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్
14 ఏళ్ల తర్వాత ప్రభుత్వ సినీ అవార్డులు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డులను’ (Gaddar Film Awards) ప్రకటించింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చలన చిత్ర అవార్డులను అందించడం సినీ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్పర్సన్, సీనియర్ నటి జయసుధ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి హైదరాబాద్‌లో (Hyderabad) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులను ఇవ్వబోతోందని దిల్ రాజు అన్నారు. ఎలాంటి వత్తిడిలు, ప్రలోభాలకు లోనుకాకుండా పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేశామని జయసుధ తెలిపారు. 2024 సంవత్సరానికి గాను మొదటి ఉత్తమ చిత్రంగా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898ఏడి’, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి), ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ (రజాకార్) గద్దర్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికయ్యారు. అదేవిధంగా స్పెషల్ జ్యూరీ అవార్డులను నటుడు దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), నటి అనన్య నాగళ్ల (పొట్టేల్)కు ప్రకటించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు. జూన్ 14న హైటెక్స్‌లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల (Gaddar Film Awards) ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. అలాగే 2014–23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామని జ్యూరీ చైర్పర్సన్ జయసుధ తెలియజేశారు. ఈ సమావేశంలో అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’కి ఉత్తమ ప్రథమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్, కాస్టూమ్ డిజైనర్ విభాగాల్లో అవార్డులు దక్కడం విశేషం. అలాగే ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఉత్తమ తృతీయ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్, ఉత్తమ ఎడిటర్‌తో పాటు ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్‌ను స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపిక చేయడం విశేషం. ఇక ఉత్తమ హిస్టరీ, హెరిటేజ్ చిత్రంగా ‘రజాకార్’ అవార్డుకు ఎంపికైంది.
సిఎం రేవంత్‌కు కృతజ్ఞతలు: చిరంజీవి – రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్ ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు దక్కించుకున్న ప్రతి ఒక్కరికీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అవార్డుల సంప్రదాయాన్ని పునరుద్ధ రించిన సిఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
2024 గద్దర్ అవార్డులు..
ఉత్తమ మొదటి చిత్రం : – కల్కి
ఉత్తమ ద్వితీయ చిత్రం : – పొట్టేల్
ఉత్తమ తృతీయ చిత్రం : – లక్కీభాస్కర్
ఉత్తమ నటుడు : – అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్తమ నటి : – నివేదా థామస్ (౩5 చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు : – నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ సహాయ నటుడు : – ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ హాస్యనటుడు : – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
ఉత్తమ సంగీత దర్శకుడు : – బీమ్స్ (రజాకార్)
ఉత్తమ స్టోరీ రైటర్ : – శివ పాలడుగు
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ :- వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గాయకుడు : – సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)
ఉత్తమ గాయని : – శ్రేయా ఘోషల్ (పుష్ప- 2)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : – గణేష్ ఆచార్య (దేవర)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి)
ఉత్తమ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ పుస్తకం: మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్ )
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ : – యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్న కథ కాదు
ఉత్తమ హిస్టరీ, హెరిటేజ్ చిత్రం : – రజాకార్
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
నటుడు- : దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)
నటి- : అనన్య నాగళ్ల (పొట్టేల్)
దర్శకులు : సుజీత్, సందీప్ (క)