న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం టీమిండియా కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి బిసిసిఐకి నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భారత టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కొత్త సారథినిఎంపిక చేయక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో వినిపిస్తున్న పేరు శుభ్‌మన్ గిల్. తాజాగా గిల్ టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో సుదీర్ఘ సమావేశమయ్యాడని జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని గంభీర్ నివాసానికి వెళ్లిన గిల్ టీమిండియాకు సంబంధించి పలు విషయాల గురించి మాట్లాడినట్టు సమాచారం.
గంభీర్, గిల్ బేటిలో కెప్టెన్సీతో సహా పలు విషయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని యువకుడైన శుభ్‌మన్‌కు భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భారత క్రికెట్ బోర్డు బిసిసిఐ కూడా గిల్ వైపే మొగ్గు చూస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి స్థితిలో గంభీర్‌తో గిల్ భేటి అయ్యాడని వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గిల్ ఇప్పటికే వన్డే టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇది కూడా అతనికి కలిసి వచ్చే అంశంగా మారింది. ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం దాదాపు ఖరారైందనే చెప్పాలి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.