వడోదర: గుజరాత్లో వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న 45 ఏళ్ల నాటి గంభీర వంతెన కుప్పకూలడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వంతెన కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తమ్మిదికి చేరినట్లు అధికారులు తెలిపారు. బుధవారం (జూలై 9) ఉదయం వంతెన మధ్యలో ఒక భాగం కూలిపోయింది. వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని పద్రా పోలీసు ఇన్స్పెక్టర్ విజయ్ చరణ్ తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు ఉన్నాయని తెలిపారు. సహాయక బృందాలు ఇప్పటివరకు 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయని. నదిలో చిక్కుకున్న ఇతర వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
“స్థానిక ఈతగాళ్ళు, పడవలు, మున్సిపల్ కార్పొరేషన్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. NDRF బృందాలు, ఇతర పరిపాలన, పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశాము. ఆరుగురు గాయపడ్డారు. వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు” అని వడోదర కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు.