లంచం తీసుకుంటుండగా జిహెచ్‌ఎంసి మూసాపేట్, సీనియర్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం…జిహెచ్‌ఎంసి, మూసాపేట్ సర్కిల్ 23లో, ఎం.సునీత సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. బాధితుడి తల్లి పేరుపై ఉన్న ఆస్తిని తన పేరుపై మార్చి మ్యూటేషన్ చేయాలని ప్రాపర్టీ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న సునీతను సంప్రదించాడు.ఈ పనిచేసేందుకు సునీత రూ.80,000 లంచం డిమాండ్ చేసింది.
పలుమార్లు కలిసి బతిమిలాడగా, చివరకు రూ.30,000లకు చేస్తానని, అంతకంటే తక్కువకు చేయనని చెప్పింది. దీంతో విసిగిపోయిన బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సునీతకు రూ.30,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. నిందితురాలిని ఎసిబి అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.