Monday, July 7, 2025

కెబిఆర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్?.. 7 ఫ్లైఓవర్లు, 6 అండర్‌పాస్‌లు!

- Advertisement -
- Advertisement -

త్వరలోనే పనులు ప్రారంభించనున్న కమిషనర్
కేసులు లేని ప్రదేశాల్లో నిర్మించే యోచన
అంచనా వ్యయం రూ. 1090 కోట్లు
భూసేకరణకే రూ. 741 కోట్లు
మనతెలంగాణ సిటీ బ్యూరో ః జీహెచ్‌ఎంసి కమిషనర్ కర్ణన్ చొరవతో కెబిఆర్ పార్కు చుట్టూ చేపట్టే ప్రాజెక్టుకు లైన్ క్లీయర్ అయిన్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ..భూసేకరణ, కోర్టు కేసుల నేపథ్యంలో పనులు పెండింగ్ పడ్డాయి. ప్రాజెక్టు ఇంజనీర్‌తో ఏమికాదని భావించిన కమిషనర్ కర్ణన్ నేరుగా రంగంలోకి దిగి అన్ని విషయాలను చక్కబెడుతూ వస్తున్నారనీ, దీంతో కోర్టు కేసులు, భూసేకరణ రోడ్డు వైడింగ్ అంశాలు చక్కబెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ నెలలోనే కెబిఆర్ పార్కు చుట్టూర చేపట్టాల్సిన పథకం పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. కేసులు లేని ప్రదేశాల్లో పనులు మొదలుపెట్టి.. ఈ పనులు పూర్తయ్యేసరికి కోర్టు కేసులు కూడా కొలిక్కి వస్తాయనేది కమిషనర్ ధీమాగా ఉన్నట్టు, ప్రాజెక్టు పూర్తి సమాచారంతో పాటు నమూనా, పార్కుకు ఎంత దూరంలో చేపడుతున్నాం. ఏకో సెన్సిటివ్ జోన్‌కు ఏలాంటి భంగం కలగకుండానే పనులు చేపట్టేందుకు కమిషనర్ నిర్ణయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

ఇంజనీర్లపై కమిషనర్ అసహనం..?
హెచ్ సిటీ స్కీంలో భాగంగాకేబీఆర్ పార్కు చుట్టూ రూ.1090(భూసేకరణకు రూ.580 కోట్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి రూ. 510 కోట్లు) కోట్లతో 7 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్‌లను నిర్మించేందుకు జీహెచ్‌ఎంసి ప్లాన్ రూపొందించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఎంఈఐఎల్ కంపెనీకి టెండర్ల దక్కాయి. అయితే, ఇక్కడ ఈకో సెన్సిటీవ్ జోన్ అంటూ మూడు కేసులు కోర్టులో ఉన్నాయి. ఫలితంగా ప్రాజెక్టు పనులు పెండింగ్‌పడ్డాయి. ఈ కేసులు లేని ప్రదేశాల్లో పనులు చేపట్టాలని కమిషనర్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెలాఖరులోపు పనులు మొదలుపెట్టేందుకు కర్ణన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రాజెక్ట్ విభాగం ఇంజనీర్ హెచ్ సిటీ పనుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనేది కమిషనర్ గుర్తించినట్టు టాక్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ. 1090 కోట్లు పరిపాలనా అనుమతులు జారీచేసినా కేబీఆర్ పార్కు ప్రాజెక్టును పెద్దగా పట్టించుకోలేదనేది ఇంజనీర్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. కేసుల విషయాన్ని కూడా కమిషనర్ స్వయంగా పట్టించుకుని అప్‌డేట్ చేస్తూ.. పథకం పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

చెక్ పోస్టు వద్ద పనులు స్టార్ట్..
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు కూడలి, కేబీఆర్ పార్కు ఇంట్రెన్స్ జంక్షన్, ముగ్దా జంక్షన్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిలీంనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్‌లలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భూసేకరణకు రూ.741 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. వాస్తవంగా ప్రాజెక్టు అంచనాలలో భూసేకరణకు రూ. 580 కోట్లుగా నిర్ణయించినా.. ప్రస్తుతం మరో రూ. 161 కోట్లు అదనంగా పెరిగి మొత్తం రూ. 741 కోట్లు అవుతుందని అంచనాకు వచ్చారు. బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వరకు 3.1 కిలోమీటర్ల మేర, కేబీఆర్ పార్కు చుట్టూ మొత్తం 299 ఆస్తులను, సుమారు 56,621 చ.గ.ల స్థలాన్ని సేకరించనున్నారు. రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్(ఆర్ డీపీ) ప్రకారం ఇక్కడ ఆస్తుల విలువను అంచనా వేయడంతో రూ. 741 కోట్లుగా పెరిగింది. ఇక వైపు భూసేకరణతో పాటు కేసులు లేని ప్రాంతాల్లో పనులు చేయాలని బల్దియా అధికారులు ప్లాన్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News