Tuesday, July 8, 2025

బిల్డింగ్ పర్మిషన్‌లు ఉన్నా.. ఎన్‌ఓసి తేవాల్సిందే

- Advertisement -
- Advertisement -

ఓసీ జారీలోనూ ఎన్‌ఓసిలు
నీటి వనరులు ఉంటే చాలు..కట్టడాలకు కొత్త రూలు
ఆక్యుపెన్సీ సర్టిఫీకేట్ జారీపై జోనల్ కమిషర్‌ల కొత్త ఆదేశాలు
లబోదిబోమంటోన్న నిర్మాణదారులు
మనతెలంగాణ సిటీ బ్యూరో ః నీటి వనరులకు చేరువగా ఉంటే చాలు.. భవన నిర్మాణ అనుమతులున్నా.. ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి ‘నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్’ తీసుకురావాలని జీహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్‌బీనగర్ జోన్ పరిధిలోని హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్‌లో ఓ దరఖాస్తుదారుడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకుని స్టిల్ట్ + 5 పోర్లు అనుమతిని తీసుకున్నారు. నిర్మాణదారుడు బ్యాంక్‌లోన్ తీసుకుని బిల్డింగ్ నిర్మించారు. భవనాన్ని నిర్మాణం పూర్తయ్యింది. ఆ భవనంలోని ఫ్లాట్స్‌ను కూడా విక్రయించడం జరిగింది. కొనుగోలు చేసిన వారు కూడా బ్యాంక్ లోన్‌లు తీసుకున్నారు. భవన నిర్మాణం పూర్తయినందున ఆ భవనానికి ‘ఆక్యుపెన్సీ సర్టిఫికేట్’(ఓసి)ని మంజూరు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకుంటే.. నిర్మితమైన ఆ భవనాలు నీటి వనరులకు సమీపంలో ఉంటే చాలు ఇరిగేషన్+ రెవెన్యూ అధికారుల సంయుక్త ఎన్‌ఓసి తీసుకురావాలని జోనల్ కమిషనర్‌లు సూచిస్తున్నారనేది ప్రధాన విమర్శ. భవనం ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో లేకున్నా.. ఎన్‌ఓసి కావాల్సిందేనని ప్లానింగ్ అధికారులకు జోనల్ కమిషనర్ ఆదేశించినట్టు అధికారులు చెబుతుండటంతో భవన యజమానులు లబోదిబోమంటున్నారు.

ఓసీ తిప్పలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ అనుమతి, ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత జారీ చేసే అక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం వెళ్ళితే.. చెరువులకు సమీపంలో లేని భవనాలకు రెవెన్యూ ఎన్‌ఓసీ, సమీపంలో ఉన్న భవనాలకు బఫర్‌జోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా చేస్తూ జీహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్‌లు విచిత్రమైన రూలును అమలుచేస్తున్నట్టు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణ అనుమతి జారీచేసే సమయంలోనే నిర్మాణం చేపట్టనున్న ప్లాట్లకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లతో పాటు లింకు డాక్యుమెంట్లను సైతం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్మాణ అనుమతులు జారీచేస్తున్న జీహెచ్‌ఎంసీ తీరా నిర్మాణం పూర్తయిన తర్వాత పది శాతంలోపు డీవియేషన్‌లు ఉన్నా, భవనాలకు జారీ చేయాల్సిన అక్యుపెన్సీ సర్టిఫికెట్ల మంజూరు కోసం దరఖాస్తుదారులు జోనల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా లేని నియమ నిబంధనలను జోనల్ కమిషనర్‌లు తెరపైకి తేవటంతో నిర్మాణాలు చేపట్టేవారు, భవన యజమానులు వత్తిళ్ళకు లోనవుతున్నట్టు పలువురు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

నీటి వనరులుంటే చాలు..
నిర్మాణ అనుమతికి లోబడి 10 శాతం డీవియేషన్స్ వరకు అనుమతించాలని నియమాలు వెల్లడిస్తున్నాయి. నిర్మాణం పూర్తయిన భవనాలకు అక్యుపన్సీ సర్టిఫికెట్ల కోసం బిల్డర్లు, గుత్తైదారులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులచుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సరికొత్త నిబంధనతో భవన నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటి వరకు కేవలం జీహెచ్‌ఎంసీ అధికారులను మాత్రమే ప్రసన్నం చేసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సరి కొత్త నిబంధనతో చెరువులు, నాలాలకు దూరంగా ఉండినా.. రెవెన్యూ, లే క్స్‌కు, ఇరిగేషన్ విభాగాలతో తనికీలు చేపట్టాల్సి ఉంది. కానీ, సంబంధం లేకపోయినా, ఈ మూడు విభాగాలకు సైతం అధికంగా చెల్లించాల్సిన దుస్థితి తలెత్తిందని బిల్డర్లు వాపోతున్నారు. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి ఐఏఎస్ ఆఫీసర్లు జోనల్ కమిషనర్లుగా ఉన్న ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలకు దగ్గరలో లేని భవనాల అక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం క్లియరెన్స్ సర్టిఫికెట్లు అడగటంతో బిల్డర్లు, ఆర్కిటెక్చర్లు తలలు పట్టుకుంటున్నారు.

కొత్త నియమాలు…
గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బిల్డింగ్ నిర్మాణ అనుమతులు జారీ చేసే ముందు ఏ మాత్రం అనుమానం వచ్చినా, ఇరిగేషన్, రెవెన్యూ ఎన్‌ఓసీలను అభ్యర్థించి, అవి సమర్పించిన తర్వాతే నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణం పూర్తయిన తర్వాత అక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు మళ్లీ ఇరిగేషన్, రెవెన్యూ ఎన్‌ఓసీల నిబంధన పెట్టడం ఎంత వరకు సబబు అంటూ బిల్డర్లు, భవన యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనను ఎత్తి వేయాలని కోరుతూ త్వరలోనే కొందర బిల్డర్లు సీఎం, మున్సిపల్ మంత్రి అయిన రేవంత్ ను కలిసే అవకాశం కూడా లేకపోలేదు. అయిదు అంతస్తులు, అంతకన్నా ఎక్కువ అంతస్తులతో నిర్మితమవుతున్న భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు అభ్యర్థిస్తుండగా, ఈ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు జాయింట్ ఇన్ స్పెక్షన్ చేసి, ఉభయ విభాగాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే సర్టిఫికెట్ల జారీ చేస్తామని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News