యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 14 ఏళ్ల వయస్పులో ఐపిఎల్‌లో అడుగుపెట్టి.. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టులో కూడా అతను అదే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఓ మ్యాచ్‌లో అతను రికార్డు సెంచరీ సాధించాడు. 78 బంతుల్లోనే 143 పరుగులు చేశాడు. అయితే త్వరలో డబుల్ సెంచరీ సాధిస్తానని.. అందుకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తనకు స్పూర్తి అని అంటున్నాడు.
అయితే తాను రికార్డు సెంచరీ కొట్టినట్లు జట్టు మేనేజర్ అంకిత్ చెప్పేవరకూ తనకు తెలియదని వైభవ్ (Vaibhav Suryavanshi) అన్నాడు. సీనియర్ల జట్టులో గిల్ ఆట చూశానని.. సెంచరీ, డబుల్ సెంచరీ తర్వాత కూడా ఇన్నింగ్స్ కొనసాగించడం, జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడం తనకు నచ్చిందని పేర్కొన్నాడు. గిల్‌ని స్పూర్తిగా తీసుకొని త్వరలో డబుల్ సెంచరీ సాధిస్తానని అన్నాడు. ‘‘డబుల్ సెంచరీపై నా మెదడులో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. నేను సెంచరీ పూర్తి చేసాక ఇంకా 20 ఓవర్లు ఉన్నాయి. అప్పుడు దాన్ని డబుల్ సెంచరీగా మారిస్తే బాగుండేది. కానీ, నేను ఆడింది కాన్ఫిడెంట్ షాట్ కాదు. అందుకే ఔట్ అయ్యా. లేకపోతే గిల్‌లా నేను డబుల్ సెంచరీ చేసేవాడిని’’ అని వైభవ్ పేర్కొన్నాడు.
ఈ రికార్డు సాధించినప్పుడు అనంతరం అందరూ అభినందించడం ఆనందంగా ఉంది కాని ఎలాంటి సంబరాలు చేసుకోలేదని అతను తెలిపాడు. జట్టు విజయం కోసం ఆడటం ఆనందమని.. వచ్చే మ్యాచ్‌లో తప్పకుండా డబుల్ సెంచరీ చేసేందుకు ప్రయత్నిస్తా అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.