Sunday, August 17, 2025

టిటిడి స్థానిక ఆలయాల్లో శాస్త్రోక్తంగా గోకులాష్టమి వేడుకలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: టిటిడి స్థానిక ఆలయాల్లో శ‌నివారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం రాత్రి 7 గంట‌లకు స్వామివారు పెద్దశేష వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులకు దర్శనమిచ్చారు. త‌రువాత గోపూజ, గోకులాష్ట‌మి ఆస్థానం జ‌రిగింది. అదేవిధంగా ఆగష్టు 17న ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్వామి వారికి స్నపన తిరుమంజనం, త‌రువాత ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఉట్లోత్స‌వం, ఆస్థానం నిర్వహిస్తారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం 4.30 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, పురాణ ప‌ఠ‌ణం, ఆస్థానం నిర్వహించారు.

నారాయణవనంలో….

నారాయ‌ణ‌వ‌నం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శుద్ది జ‌రిగింది. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన నిర్వ‌హించారు. ఆగష్టు 17వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

కార్వేటినగరంలో

కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి, శ్రీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకం, ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హించారు. త‌రువాత‌ సాయంత్రం ఆస్థానం నిర్వహించారు.

ఆగష్టు 17వ తేదీన ఉట్లోత్సవం సందర్భంగా ఉదయం సుప్రభాతం, తోమల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఉత్సవర్లకు సమర్పణ, సాయంత్రం గోపూజ, ఉట్లోత్సవం , రాత్రి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

అదేవిధంగా తిరుప‌తి, ఒంటిమిట్టల‌లోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల్లో గోకులాష్ట‌మి ఆస్థానం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Gokulashtami

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News