మనతెలంగాణ/మెదక్ ప్రతినిదిః వరుస నేరాలకు పాల్పడుతూ ఈనెల 11న ఒక కేసులో శిక్షను అనుభవించి బెయిల్‌పై విడుదలైన నిందితుడు రెండు రోజుల వ్యవదిలో అనగా ఈనెల 13వ తేదీ బుదవారం ఓ మహిళపై దాడి చేసి తులం బంగారాన్ని దొచుకెళ్లిన నిందితున్ని మెదక్ జిల్లా పోలీసులు 24 గంటల్లో పట్టుకుని గురువారం రిమాండ్ తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ…. ఈనెల 13న మెదక్ నుంచి హైదరాబాద్ ప్రయాణీస్తున్న సమయంలో నిందితుడు ఆర్టీసీ బస్సులో ఒక మహిళతో పరిచయం ఏర్పరచుకొని నర్సాపూర్‌లో ఆమెతోపాటు బస్సు దిగి మద్యం కొనుక్కొని అక్కడినుంచి అడవివైపు వెళ్లి మహిళకు మద్యం సేవింపజేసి మత్తులో ఉన్న సమయంలో ఆమెపై దాడి చేసి ఆమె చెవికి ఉన్న బంగారు కమ్మలను ఎత్తుకెళ్లాడు.
వెంటనే మహిళ 100 కు డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మహిళను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్పించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించి గురువారం ఉదయం గుమ్మడిదల టోల్‌గేట్ వద్ద నిందితున్ని పట్టుకున్నామని తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుని నేర చరిత్ర బహిర్గతమైందన్నారు. నిందితుడు మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండల పరిదిలోగల మద్దులవాయి గ్రామానికి చెందిన గజ్జెల బిక్షపతి, వయస్సు(27). నిందితునిపై గత పది సంవత్సరాల కాలంలో దాదాపు మెదక్, సంగారెడ్డి జిల్లాలలో 11 కేసులు నమోదయ్యాయన్నారు. విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి మద్యం, జూదం వంటి వ్యసనాలకు ఖర్చుల నిమిత్తం నిందితుడు తరుచూ దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు.
2015లో మొదటిసారి ఇతనిపై మెదక్ పట్టణంలో కేసు నమోదు కాగా 2021లో ఫోక్సో కేసులో జైలు పాలయ్యాడని వివరించారు. వరుస నేరాలకు పాల్పడుతున్న ఇతనిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్పీ వివరించారు. 24 గంటల్లోనే చాకచాక్యంగా నిందితున్ని పట్టుకుని సొమ్ము రికవరీ చేసిన తూప్రాన్ డిఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై లింగం, కానిస్టేబుల్ శ్రీకాంత్‌లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.