అయ్యప్ప మాల ధరించే తెలుగు భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వరకు వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ రైలును ఇకపై సెప్టెంబర్ 29 నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా మార్చుతూ రైల్వే బోర్డు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 17229, 17230 నెంబర్లపై నడిచే రైళ్లు ఇకపై సెప్టెంబరు 29 నుంచి కొత్తగా 20629, 20630 నంబర్లపై నడిచేలా మార్పులు చేశారు. రైలును సూపర్ ఫాస్ట్‌గా మార్చటంతో ప్రయాణ సమయం తగ్గి అయ్యప్ప దీక్ష దారులకు ప్రయాణం సులభతరం కానుంది. అయ్యప్ప దీక్ష ధరించే భక్తలు రెండు, మూడు నెలల ముందే ముందస్తు రిజర్వేషన్లు చేసుకోనున్నారు. మారిన ఈ రైళ్ల నంబర్లతోనే చేసుకోవాలని రైల్వే కమర్షియల్ అధికారి సతీశ్ వెల్లడించారు.
సికింద్రాబాద్ తిరువనంతపురం (20629), సూపర్ ఫాస్ట్ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.25కి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి నుంచి అర్ధరాత్రి 1.33 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.20 గంటలకు తిరువనంతపురానికి చేరుకుంటుంది. తిరువనంతపురం సికింద్రాబాద్ (20630) రైలు తిరువనంతపురంలో ఉదయం 6.45 గంటలకు బయలు దేరి తిరుపతికి రాత్రి 11.45 చేరుకుని అక్కడి నుంచి చీరాల, బాపట్ల, తెనాలి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ నుంచి ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
జులై 8 నుంచి రైల్వే అధికారులు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు చేశారు. రైళ్లకు ఒక్కో థర్డ్ ఎసి బోగీని జత చేస్తున్నట్లు ద.మ.రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం జులై 13,14 తేదీల నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఎసి బోగీలను గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు(17201, 17202), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (17233, 17234), విజయవాడ-కాచిగూడ, కాచిగూడ-విజయవాడ (12713, 12714), విజయవాడ-చెన్నై, చెన్నై-విజయవాడ (12711, 12712) రైళ్లకు శాశ్వత ప్రాతిపదికన థర్డ్ ఎసి బోగీలను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్‌ఓ సిహెచ్ శ్రీధర్ వెల్లడించారు. రైల్వే స్టేషన్‌లలో, రైళ్లలో పోయిన సెల్‌ఫోన్లను ప్రయాణికులకు తిరిగి అప్పగించేందుకు ’ఆపరేషన్ అమానత్’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే మరో ప్రకటనలో వెల్లడించింది. జూన్‌లో 140 ఫిర్యాదులు రాగా 25 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని 14 ఫోన్లను యజమానులకు అప్పగించినట్లు వివరించింది.