రాజ్యాంగ నైతికతను కవులు భుజానికెత్తుకోవాలి
కవులు మూలాల ఎరుకతో రాయడం మౌలిక అవసరం
ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
మన తెలంగాణ / అమరావతి : రాజ్యాంగ నైతికతను కవులు భుజానికెత్తుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న(Goreti venkanna) అన్నారు. మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ గవర్నర్‌పేట బాలోత్సవ్ భవన్‌లో బంగార్రాజు కంఠ రచించిన ‘దుఃఖం పండుతున్న నేల’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా వచ్చిన ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ- సోషల్ మీడియాలో ఒక లైక్ కోసం జీవితాల్ని కోల్పోతున్న ప్రమాదకరమైన వాతావరణంలో మనం జీవిస్తున్నామన్నారు.
ఇలాంటి సమయంలోనే కవులు ఉమ్మడిగా గొంతెత్తాలన్నారు. కవులకు ఏ విషయాన్నయినా కవిత్వం చేసే హక్కు ఉందని, కవుల్ని ఎవరూ శాసించవద్దని గోరటి వెంకన్న (Goreti venkanna) పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ బిక్కి కృష్ణ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా క్రమశిక్షణ లేదన్నారు. సినీ గేయ రచయిత రసరాజు మాట్లాడుతూ కవికి సొంత డిక్షన్ కావాలన్నారు. సుప్రసిద్ధ కవయిత్రి, విమర్శకురాలు ఘంటశాల నిర్మల మాట్లాడుతూ స్త్రీలను గౌరవించేదే గొప్ప సంస్కృతి అన్నారు. సమాజంలో ప్రతి చోట స్త్రీలపై జరుగుతున్న వివక్షాపూరిత మానసిక మారణకాండను కవులు నిరసించాలన్నారు.
మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ అధ్యక్షులు కలిమి శ్రీ మాట్లాడుతూ పుస్తకాలు కొనడమంటే రచయితలను గౌరవించడమేనన్నారు. ఇంటి నిర్మాణానికి పరిమితులు ఇచ్చే అధికారులు ఆ ఇంట్లో ఒక పుస్తకాల గది ఉండడం తప్పనిసరి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఐఆర్ ఎస్ అధికారి, ప్రముఖ కవి డాక్టర్ జెల్ది విద్యాధరరావు, పోలీసు అధికారి, కవి లోసారి సుధాకర్, పుస్తక రచయిత బంగార్రాజు కంఠ, సాహితీవేత్తలు డాక్టర్ ఘంటా విజయ్‌కుమార్, సరికొండ నరసింహరావు, వొర ప్రసాద్, శిఖా ఆకాష్ తదితరులు ప్రసంగించగా చొప్పా రాఘవేంద్ర శేఖర్ పర్యవేక్షించారు.