Wednesday, August 13, 2025

బిజెపిలో చేరే ముందు ఒకసారి వారితో మాట్లాడండి: రాజా సింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘బిజెపిలో చేరే ముందు ఆలోచించుకోండి..’ అని ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ వివిధ పార్టీల నాయకులకు సూచించారు. బిజెపిలో చేరే ముందు తాను చెప్పిన మాటలు గుర్తు పెట్టుకోవాలని, డైరీలో రాసి పెట్టుకోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిజెపిలో చేరిన రోజు ముందు వరుసలో కూర్చోబెడతారని, ఆ మర్నాడు వెనుక సీటుకు మారుస్తారని ఆయన తెలిపారు. బిజెపిలో చేరిన తర్వాత మీకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తారన్న గ్యారంటీ ఏమీ లేదని, మిమ్మల్ని నమ్ముకుని మీపై ఎంతో ఆశలు పెట్టుకుని బిజెపిలో చేరితే ఆ తర్వాత మీరు వారికి ఏ పని చేసి పెట్టలేరని, పదవులూ ఇప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.

ఎమ్మెల్సీ విజయశాంతి, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన రెడ్డి తదితరులు బిజెపి తీర్థం తీసుకుని ఆ తర్వాత గుర్తింపులేకుండా పోయారని ఆయన ఉదహరించారు. 11 సంవత్సరాలుగా తాము అణచివేతకు గురి అవుతున్నామని ఆయన ఆరోపించారు. హిందూ సమాజానికి, దేశానికి మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బిజెపి అని ఆయన తెలిపారు. కానీ బిజెపి రాష్ట్ర నాయకుల వల్లే పార్టీకి నష్టం వాటిల్లుతున్నదని ఆయన విమర్శించారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో రాక్షసులు నాశనమవుతారని, తాము ఏది చెబితే బిజెపిలో అదే చెల్లుబాటు అవుతుందని కొంత మంది నాయకులు ప్రవర్తిస్తున్నారని రాజాసింగ్ దుయ్యబట్టారు. కాబట్టి చేరే ముందు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News