Tuesday, July 29, 2025

మాధోపట్టి.. చదువుల తల్లికి ముద్దుల పట్టి!

- Advertisement -
- Advertisement -

మన దేశంలో కఠినమైన పరీక్షా ఏదైనా ఉందంటే అది సివిల్స్ సర్వీసెస్ తర్వాతే. ఏటా సివిల్స్ సర్వీసెస్ రాసే వారి సంఖ్య దాదాపు 13 లక్షలమంది ఉండగా అందులో ఉత్తీర్ణత సాధించేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. దీనిని బట్టి ఈ పరీక్ష ఎంత కఠినతరమైనదో మనకు అర్థమవుతుంది. యుపిఎస్‌సి పరీక్షలో విజయం సాధించి ఐఎఎస్, ఐపిఎస్ లేదా ఐఎఫ్‌ఎస్ కావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అత్యంత కఠినమైన యుపిఎస్‌సి ప్రిలిమినరీ, ఫైనల్ పరీక్షలో విజయం సాధించడం కంటే ఇంటర్వ్యూలో విజయం సాధించడం మరింత కష్టం. ఈ పరీక్షలో నెగ్గాలంటే రోజుకు ఒక గంట రెండు గంటలు చదివితే సరిపోదు, రోజుకు 8 గంటలకు పైగా చదివితే తప్ప ఈ పరీక్షలో విజయాన్ని సాధించలేరు. మన రాష్ట్రంలో సివిల్స్ రాసే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ అందులో విజయం సాధించే వారి సంఖ్య చాలాతక్కువే.

రాష్ట్రంలో అతి కొద్ది మంది విజయం సాధించినా పెద్ద ఘన విజయం సాధించినట్లుగా మనం భావిస్తాం. అలాంటి ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం ఊరిలో (Government job  village )ఒక్కరికి వస్తేనే మహా గొప్ప అనుకుంటే ఓ ఊరిలో మాత్రం దాదాపు ఇంటికో ఐఎఎస్, ఐపిఎస్ అధికారి ఉండడం విశేషం. కేవలం 75 ఇళ్లు మాత్రమే ఉండే ఓ చిన్న గ్రామం నుంచి 51 మందికి పైగా ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు ఉన్నారంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. ‘ఐఎఎస్ ఫ్యాక్టరీ’ గా పేరు తెచ్చుకున్న ఈ గ్రామం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం. ఒకే ఊరిలో ఇంతమంది ఐఎఎస్, ఐపిఎస్, ఇంకా ఉన్నత అధికారులు ఉద్భవించారని మనకు అనుమానం రావొచ్చు. అంతేకాకుండా ఈ గ్రామంలో సివిల్ సర్వీస్‌కి సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఏమైనా ఉన్నాయేమో అనే సందేహం కూడా ప్రతి ఒక్కరికీ వస్తుంది.

కానీ ఆ గ్రామంలో ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేవు. అయితే కొందరు ఏళ్లకేళ్లు కోచింగ్‌లు తీసుకున్నా, రూంలో కూర్చొని పుస్తకాలను ఔపోసన పట్టినా, ఎక్కడో ఏదో చిన్న తప్పిదంతో విజయం సాధించలేకపోతారు. అలాంటిది ఓ చిన్న గ్రామం నుండి ఇప్పటివరకు 51మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక అవ్వడం గర్వించదగిన విషయం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ గ్రామానికి చెందిన పురుషులే కాదు మహిళలు కూడా ఎలాంటి శిక్షణ లేకుండానే ఐఎఎస్, ఐపిఎస్ అధికారులుగా ఎదిగారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ గ్రామం నుండి కేవలం ఐఎఎస్, ఐపిఎస్‌లే కాకుండా ఇతర రంగాల్లో కూడా విశేషంగా రాణిస్తున్నారు. ఈ గ్రామంనుంచి ఇప్పటివరకు స్పేస్, అణుపరిశోధన, న్యాయసేవలు, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నత స్థాయిల్లో స్థిరపడటం గమనార్హం.

ఒకే కుటుంబం నుంచి నలుగురు అన్నదమ్ములు ఐఎఎస్ అధికారులు ఉండటంతో భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో సివిల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న అభ్యర్థులున్న గ్రామంగా మాధోపట్టి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్, ఘాజీపూర్‌లోని, గహ్మర్ అనే గ్రామానికి సైన్యంలో ఒక స్పెషల్ గుర్తింపు ఉన్నట్లు మాధోపట్టి గ్రామానికి కూడా సైన్యంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.  ఆ గ్రామం నుంచి చాలామంది సైన్యంలో సేవలందిస్తున్నారు. అందుకే ఉత్తరప్రదేశ్ అంటేనే వీర జవాన్లకు పుట్టినిల్లుగా పేరుగాంచింది. దేశానికి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వ అధికారులను అందించిన ఈ గ్రామం దేశంలో ట్రేడ్‌మార్క్‌గా మారింది. మాధోపట్టికి చెందిన మొట్టమొదటి ప్రభుత్వోద్యోగి ఖాన్ బహదూర్ సయ్యద్ మహ్మద్ ముస్తఫా (కవి వామిక్ జౌన్పురి తండ్రి).

అతను 1914 లో సివిల్ సర్వీసెస్ (అప్పటి ఇండియన్ సివిల్ సర్వీసెస్, బ్రిటిష్ ఇండియా) లో చేరాడు. ఆయన తరువాత 1952 లో ఇందు ప్రకాష్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రామంలో రెండో వ్యక్తిగా పేరొందారు. గ్రామం యొక్క అతిపెద్ద విజయం 1955 లో వినయ్ కుమార్ సింగ్ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం. ఒకప్పుడు విద్య ఎరుగని గ్రామానికి విద్య నేర్పిన గురువులు ఎవరో కాదు స్వాతంత్య్ర సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, అతని భార్య శ్యామ్రతి సింగ్. 1917 అంతకంటే ముందు గ్రామంలో స్కూల్ గాని చదువుకోవడానికి ఎలాంటి వసతులు లేని సమయంలో వీరు అందించిన కృషి వల్లే ఈ రోజు గ్రామంలో ఎంతోమంది ప్రభుత్వ అధికారులు దేశానికి సేవ చేస్తున్నారు. ఆ తర్వాత ఎంతమంది అంకితభావంతో, దృఢ సంకల్పంతో లక్ష్యం పెట్టుకొని లక్ష్యసాధన కోసం అహర్నిశలు శ్రమించి ఎలాంటి కోచింగ్ లేకుండానే విజయం సాధిస్తున్నారు.

  • కోట దామోదర్, 93914 80475
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News