సర్వీస్ వేగవంతం కోసం ముందుగానే టిప్పు చెల్లించాలని వినియోగదారులను బలవంతం చేస్తున్నట్టు ఆరోపణలు రావడంపై యూబర్ సంస్థకు సిసిపిఎ ( సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ) నోటీస్ జారీ చేసింది. “అడ్వాన్స్ టిప్”విధానం తీవ్రమైన ఆందోళన కలిగించే సమస్యగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు. ఇది అనైతికం, దోపిడీ విధానంగా ఆయన విమర్శించారు. సర్వీస్ పూర్తయిన తరువాత వినియోగదారులు
సంతోషంతో టిప్పు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, కానీ ముందుగా టిప్పు ఇవ్వాలని బలవంతం చేయడం అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణన లోకి తీసుకుని దీనిపై దర్యాప్తు చేయాలని సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఆదేశించారు. ఈమేరకు ఊబర్ నుంచి వివరణ కోరుతూ సిసిపిఎ బుధవారం నోటీస్ జారీ చేసిందని చెప్పారు. వినియోగదారుల సేవల్లో న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని మంత్రి జోషీ సూచించారు.