భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంత వ్యత్యాసాలు చూపకుండా, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక భేదాలు పాటించకుండా, రాజు, పేద తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన, నాణ్యమైన విద్య-, వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం. ప్రజలు తమ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న నినాదాన్ని నిజం చేయాలన్న ఆలోచన ఏ మాత్రం పాలకులకు ఉన్నా, పుట్టిన ప్రతి బిడ్డను 5 ఏళ్ళ వయస్సులో దత్తత తీసుకోవాలి. విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసి సమాజానికి అందించాలి. ఆ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. నిజానికి ఇది ప్రభుత్వం మీద ఉన్న చట్టబద్ధమైన బాధ్యత కూడా.
అన్నీ ఉచితం అని ఊదరగొట్టే ప్రభుత్వాలు విద్య, -వైద్యం కోసం ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థలను ఏర్పాటు చేయాలి. బోధన రుసుములు, ఉపకార వేతనాలు, పరీక్ష ఫీజులు, భోజన సౌకర్యం, దుస్తులు, పుస్తకాల పంపిణీ, బస్సు- రైలు పాసులు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వాహణ మొదలైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రజలను ప్రలోభపెట్టే సాధనాలుగా సంక్షేమ పథకాలను ( Welfare schemes) ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిఉన్నట్లు పథకాలెన్ని ఉన్నా ఫలితం శూన్యం. నల్లబల్ల పథకం (ఒబిబి) 1987, ఎపి ప్రాథమిక విద్యాపథకం (ఎపిపిఇపి) 1984, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డిపిఇపి) 1996, సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ) 2002, (దీన్ని 2007లో రాజీవ్ విద్యా మిషన్ (ఆర్‌విఎం) గా మార్చారు. ఎపి పాఠశాలల ఆరోగ్య పథకం (ఎపిఎస్‌హెచ్‌పి) 1992, విద్యా విషయక దూరదర్శన్ కార్యక్రమం (ఇటివిపిP) 1986, పాఠశాల సంసిద్ధాంత కార్యక్రమాలు (ఎస్‌ఆర్‌పి),
ఆవాస పాఠశాలలు (ఆర్‌ఎస్), దూరదర్శన్ పాఠాలు (టివి లెస్సెన్స్), రేడియో పాఠాలు, టెలికాన్ఫరెన్సింగ్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం (ఎస్‌పిఒటి) 1993, సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం (సిసిఆర్‌టి), జాతీయస్థాయి సంస్థలు:- కేంద్రీయ విద్యా సలహా సంఘం (సిఎబిఇ) 1921, కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘం (సిఎఎస్‌ఇ) 1929, సార్జంట్ విద్యా కమిషన్, సెకండరీ విద్యా కమిషన్, యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) 1948, జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి (ఎన్‌సిఇఆర్‌టి) 1961, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) 1973, ప్రాంతీయ విద్యా సంస్థ (ఎన్‌ఐఇపిఎ) 1979, కేంద్రీయ ఆంగ్ల, విదేశీ భాషల సంస్థ (సిఐఇఎఫ్‌ఎల్) (ఇఫ్లూ) 1958. రాష్ట్రస్థాయి
విద్యా సంస్థలు: -రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సిఇఆర్‌టి) 1967, పాఠ్యపుస్తకాల రచయితల కమిటి, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (ఎస్‌ఐఇటి) 1985, రాష్ట్ర విద్యా నిర్వహణ, శిక్షణ సంస్థ (ఎస్‌ఐఇఎంఎటి) 1979, రాష్ట్ర వనరుల కేంద్రం (ఎస్‌ఆర్‌సి) 1978, జిల్లా విద్యా, శిక్షణ సంస్థ (డిఐఇటి) 1989, మండల వనరుల కేంద్రం (ఎంఆర్‌సి), స్కూల్ కాంప్లెక్స్ (ఎస్‌సి), మొదలియర్ విద్యా కమీషన్, కొఠారీ విద్యా కమిషన్, ఛటోపాధ్యాయ విద్యా కమిషన్ 1983, జాతీయ విద్యా విధానం 1986, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి, బడిబాట, రాష్ట్ర విద్యా చైతన్య ఉత్సవాలు, కస్తూర్భా బాలికా విద్యాలయాలు, సక్సెస్ పాఠశాలలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 2009, సాక్షర భారత్ (2009), మధ్యాహ్న భోజన పథకం 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం (ఎన్‌సిఎఫ్) 2005, ప్రొఫెసర్ యశ్ పాల్ నివేదిక 1993, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2000.
విద్యా ప్రైవేటీకరణ కోసం పున్నయ్య కమిటి (1992), స్వామినాథన్ కమిటీ (1992), బిర్లా- అంబాని కమిటీ (2000), విద్యా హక్కు చట్టం 2009, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ఫీజు రీయంబర్స్‌మెంట్ తదితర కమిటీలు కమిషన్లు పథకాలు ప్రవేశపెట్టాయి. వికలాంగుల కోసం, స్త్రీ విద్య కోసం, బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుంది. వీటితోపాటు ఒక్కొక్క స్కూలు మొత్తం 57 రకాల రికార్డులను, రిజిష్టర్లను నిర్వహిస్తుంది. వీటన్నింటినీ ప్రభుత్వాలు మొక్కు‘బడి’ పథకాలుగా మార్చడం విశేషం. ఆయా పథకాలను ఎట్లా ప్రవేశపెట్టాలో, ఎలా నీరు కార్చాలో మన దేశ పాలకులకు తెలిసినంతగా ప్రపంచంలో మరే దేశ పాలకులకు తెలియదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాషాయ విషగరళంగా మార్చిన సంగతి విదితమే.
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని విద్యావేత్తలు, సామాజికవేత్తలు విద్యార్థి సంఘాలు మేధావులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన తిరోగమన విధానాన్ని భారతీయ సమాజంపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి తన గొయ్యి తానే తీసుకోవడం తప్ప మరొకటి కాదనేది నిజం. ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నప్పటికీ విద్య, -వైద్యం సామాన్యుడి దరిచేరడం లేదు. కారణమేదైనా పాపం ప్రభుత్వాలదే. అక్కరకురాని చుక్కలు ఎన్ని ఉంటేనేమి? సూర్యుడు ఒక్కడుంటే చాలు! అన్నట్లు వందల కొలది సంక్షేమ పథకాలు పెట్టడం కన్నా, అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన సమీకృత/ఏకీకృత విద్య, -వైద్య సంస్థలను మండల కేంద్రం యూనిట్‌గా స్థాపించడం మేలు.
దేశంలో ఉపాధ్యాయులు, డాక్టర్ల కొరత 40 శాతానికి మించే ఉంటుంది. 5వ, తరగతికి వచ్చే సరికి 78%, 10వ, తరగతికి వచ్చే సరికి 62 శాతం, ఉన్నత విద్యకు వచ్చేసరికి 7 శాతానికి విద్యార్థుల సంఖ్య మించడం లేదు. 7 శాతంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల అవసరాలను, మౌలిక వసతులను కూడా ప్రభుత్వం తీర్చక పోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, విద్యను ఆయుధంగా మలచుకోగలిగితే నిరుద్యోగం, పేదరికం నిర్మూలించవచ్చు. ప్రపంచంలో అత్యంత విలువైనవి, అవసరమైనవి మానవ వనరులు. మానవ వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులను సమాజ అవసరాలకు, దేశ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్చిన సామాజిక, చట్టబద్ధమైన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.
-విశ్వ జంపాల
77939 68907