Saturday, August 23, 2025

గవర్నర్లు విధి నిర్వహణలో గాడి తప్పితే..

- Advertisement -
- Advertisement -

గవర్నర్ల విధులుపై మళ్లీ సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు నిర్దిష్ట గడువును సుప్రీం కోర్టు విధించ వచ్చా? అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143 (1) అధికరణ కింద సర్వోన్నత న్యాయస్థానాన్ని అభిప్రాయం కోరడంపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం కూడా తన విచారణ కొనసాగించింది. ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను ఎలాంటి కారణం లేకుండా కొన్నేళ్లపాటు గవర్నర్లు నిలిపివేస్తే ఏం చేయాలి? అన్న సమస్యపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. గవర్నర్ బిల్లులు నిలిపివేస్తే ముఖ్యమంత్రి కోర్టును ఆశ్రయించకుండా గవర్నర్‌తో చర్చలు జరపవచ్చని, ప్రధాని, రాష్ట్రపతిని కూడా కలిసి పరిష్కారాలు కనుక్కోవచ్చని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపించారు.

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అకారణంగా తమ విధులు నిర్వహించకపోతే కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లుల ఆమోదానికి (approval bills) గవర్నర్‌కు, రాష్ట్రపతికి రాజ్యాంగంలో ఎక్కడా నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించలేదని మెహతా తెలియజేశారు. అయితే తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందేనని, సుప్రీం కోర్టు రాజ్యాంగ పరిరక్షకురాలని సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టంచేశారు. ఈ సమస్యపై మళ్లీ 26న విచారణ జరగనుంది. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య సంఘర్షణ వైఖరి కొనసాగుతుండడం పాలనా వ్యవహారాలకు ప్రతిబంధకమవుతోంది. కేరళ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు రాజకీయ ప్రత్యర్థులుగా గవర్నర్లు వ్యవహరించడం చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని గవర్నర్ల వైఖరిని తప్పుపట్టడం తెలిసిందే.

శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపినప్పుడు దానిని తాను సమ్మతిస్తున్నానని లేదా సమ్మతిని నిలిపివేస్తూ రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తున్నానని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం గవర్నర్ బాధ్యత. ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని తెలియజేస్తూ తిరిగి శాసనసభకు పునఃపరిశీలనకు పంపడం తప్పనిసరి. అదే బిల్లును సవరణతో శాసనసభ ఆమోదించి పంపితే గవర్నర్ వెంటనే ఆమోదించక తప్పదు. రాజ్యాంగ పరమైన ఈ ప్రక్రియకు విరుద్ధంగా గవర్నర్లు తమ బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని, అభ్యంతరాలుంటే తమకు తెలియజేయడం లేదని, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు, కేరళ, పంజాబ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీటన్నిటిలో తమిళనాడు గవర్నర్ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది.

శాసనసభ పంపిన బిల్లులను ఎలాంటి పరిశీలన చేయకుండా, మూడేళ్లుగా గవర్నర్ తనవద్దే అట్టే పెట్టుకోవడం వివాదాలకు దారి తీసింది. ఈ వివాదంపైనే సుప్రీం కోర్టు బిల్లుల ఆమోదానికి గవర్నర్‌కు, రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ తీర్పు వెలువరించడం సంచలనం కలిగించింది. ఇది రాజ్యాంగపరమైన రగడగా మారి విచారణ సాగుతోంది. గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు తలెత్తి ప్రతిష్టంభన ఏర్పడిన సంఘటనలు ఉన్నాయి. గవర్నర్లు కొందరు గాడితప్పి నడుస్తున్నా లేదా రాజ్యాంగానికి అతీతులుగా వ్యవహరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలను గవర్నర్లు ముప్పుతిప్పలు పెట్టడం కేంద్ర ప్రభుత్వానికి ఆనందం కలిగిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అంతేకాదు పరోక్షంగా ఆయా గవర్నర్లకు వత్తాసు పలుకుతున్నారేమో అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గవర్నర్ అంటే ఒక రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి. కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, విధులు రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌కు ఉంటాయి. అయినాసరే ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విధి. అయితే కేంద్రం లోను, రాష్ట్రాల్లోను వివిధ రాజకీయ వ్యవస్థలు పాలించడం ప్రారంభం కావడంతో రాజ్యాంగపరంగా అనుసరించాల్సిన విధానాలు గాడి తప్పుతున్నాయి. 1935 నాటి చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు గవర్నర్లకు విపరీతమైన అధికారాలను కట్టబెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్లుగా అప్పటి గవర్నర్లు వ్యవహరించేవారు. ఆ పోకడ ఇప్పటికీ కొంతమంది గవర్నర్లలో కనిపిస్తుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి.

గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రామ్‌లాల్ ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ను కాదని నాదెండ్ల భాస్కర్రావును ముఖ్యమంత్రి స్థానంలో రాజ్యాంగ విరుద్ధంగా కూర్చోబెట్టడం ఎంతటి ఆందోళనలకు దారి తీసిందో తెలిసిందే. ఇలాంటి సంఘటనల వల్ల గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్లు ప్రజలకు జవాబుదారీ అవుతారా?అలాగే వారికి శాసనాధికారాలు ఉంటాయా? అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారికి ఉండే అధికారాలన్నీ శాసనసభ ఆమోదించిన బిల్లులను పరిశీలించి తీర్పు ఇవ్వడమే. ఈ అంశాలనే సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నిస్తోంది.

గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా తమకు సంక్రమించిన విధులను నెరవేర్చవలసిన బాధ్యత ఉందని సూచిస్తోంది. ఆ బాధ్యత సక్రమంగా నెరవేరనప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవడం తప్పవుతుందా? రాజ్యాంగాన్ని రక్షించవలసిన ధర్మస్థానం చేతులను కట్టిపడేస్తారా అని ప్రశ్నిస్తోంది. గవర్నర్లకు, అధికారపక్షానికి ముఖ్యంగా ముఖ్యమంత్రికి, మంత్రి మండలికి మధ్య వ్యక్తిగత విభేదాలు, వ్యవస్థాపరమైన సంఘర్షణలు చిలికిచిలికి గాలివానలా చెలరేగిపోతుండటం ఎవరికీ మంచిది కాదు. రాజ్యాంగ ప్రతినిధులు రాజకీయ రగడగా మారకూడదని రాజకీయ, న్యాయ నీతిజ్ఞులు సూచించడంలో తప్పులేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News