Saturday, May 17, 2025

ప్రభుత్వం ప్రతిపక్షం కలిసికట్టుగా ఉగ్ర పాక్‌ను ఎండగడుదాం

- Advertisement -
- Advertisement -

పార్టీల ఎంపిలతో ప్రతినిధి బృందాలు
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
వచ్చే వారం పలు దేశాలకు పయనం
టూర్‌కు పలు పార్టీల అంగీకారం

న్యూఢిల్లీ : ఉగ్రవాద చర్యలపై పాకిస్థాన్ నిజరూపాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లేందుకు భారత ప్రభుత్వం సకల ప్రయత్నాలకు దిగింది. పాకిస్థాన్‌ను పలు అంతర్జాతీయ వేదికల పై ఏకాకిని చేసేందుకు ప్రత్యేకించి దౌత్య యత్నాలను ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని పలు పార్టీల ఎంపిలతో కూడిన ప్రతినిధి బృందాలను అనేక దేశాలకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్థాన్‌కు ఎటువంటి తెరిపి ఇవ్వకుండా అన్ని విధాలుగా దిగ్బంధనం చేయడం ద్వారా , ఈ దేశ ఉగ్ర స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు తక్షణం విరామం లేని రీతిలో తెలియచేయాల్సి ఉందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.

ఇక దేశంలోని రాజకీయ పార్టీలను ప్రతినిధి బృందాలలో భాగస్వామ్య పక్షాలుగా చేయడం ద్వారా ప్రతిపక్షాలకు కూడా ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెరిగేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. ఆపరేషన్ సిందూర భారతదేశపు అత్యంత కీలకమైన ఎదురుదాడి ప్రక్రియ , ఈ వ్యూహాత్మక చర్యలో విజయం తరువాత దౌత్యపరంగా పాకిస్థాన్‌పై దాడికి దిగడం కీలక ఘట్టంగా భావిస్తున్నారు. ఐరాస ఇతర ప్రపంచ వేదికలు, పలు దేశాలకు మన ప్రతినిధి బృందాలు వెళ్లడం, అక్కడ పాకిస్థాన్ ఉగ్ర చర్యల గురించి సరైన రీతిలో సమగ్ర సాక్షాధారాలతో వివరించడం ఈ రాయబారం కీలక అంశం కానుంది. ఎక్కువ రోజులు వేచి చూడకుండా వచ్చే వారం నుంచే పలు దేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపించాలని నిర్ణయించారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలను ప్రతినిధి బృందాలలో చేర్చేందుకు అవసరం అయిన కసరత్తు ఆరంభం అయింది. ఈ ప్రతిపాదనను పార్టీలు ఖచ్చితంగా ఆమోదించాల్సిన పరిస్థితి కూడా ఉంది. దేశ భద్రతా కోణంలో ఈ దౌత్య ప్రక్రియ నుంచి ఏ పార్టీ కూడా వైదొలిగే అవకాశం లేదు.

ఆమోదం తెలిపిన పలు పార్టీలు

ఇప్పటికే కొన్ని పార్టీలు తాము ప్రతినిధి బృందంలో ఉండేందుకు ఆమోదం తెలిపాయి. తమ పార్టీల తరఫున ఎవరు ఈ బృందంలో ఉంటారనేది కూడా కొన్ని పార్టీలు తెలియచేశాయని వెల్లడైంది. అయితే ప్రతినిధి బృందాలలో ఎంత మంది ఉండాలి? ఏ ఏ పార్టీ నుంచి ఎందరు ఉండాలి? అనేది ఖరారు కావల్సి ఉంది. అయితే ప్రతినిధి బృందంలో 30 మంది వరకూ ఎంపిలు ఉంటారని వెల్లడైంది. ఈ వేర్వేరు ప్రతినిధి బృందాలు ముందుగా ఎంచుకున్న దేశాలలో పది రోజుల పాటు పర్యటిస్తాయి. ఏఏ దేశాలకు వెళ్లాలనేది ఇప్పటికైతే ఖరారు కాలేదు.

కాగా బృందాలలో కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, ఎన్‌సిపి (శరద్ పవార్) జెడియు, బిజెడి, సిపిఎం తెలుగుదేశం వంటి కొన్ని మిత్రపక్షాల ఎంపిలు సభ్యులుగా ఉంటారని వెల్లడైంది. ఈ నెల 22 లేదా 23 నుంచి ఈ దౌత్య యాత్రలు సాగుతాయి. ఆయా పార్టీలకు పూర్తి వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ సకాలంలో తెలియచేస్తుంది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ , ఒడిషాకు చెందిన బిజెపి ఎంపి అపరాజిత సారంగి అధికార పార్టీ తరఫున బృందంలో ఉంటారు. కాంగ్రెస్ నుంచి శశి థరూర్, మనిష్ షి తివారీ , సల్మాన్ ఖుర్షీద్ ఉంటారు. ప్రతినిధి బృందాల పర్యటన గురించి కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజూ తమ పార్టీ నేత ఖర్గేతో మాట్లాడినట్లు జై రాం రమేష్ నిర్థారించారు.

టిఎంసి నుంచి సందీప్ బన్యోపాధ్యాయ, జెడియు నుంచి సంజయ్ ఝా, ఎన్‌సిపి నుంచి సుప్రియా సూలే , డిఎంకె నుంచి కనిమొళి పేర్లు ఖరారు అయ్యాయి. ఇటీవలి అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కాకపోవడం వివాదాస్పదం అయింది. మోడీ ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే విమర్శలు తలెత్తిన దశలో ఇటువంటిదేమీ లేదని స్పష్టం చేసేలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక విషయంలో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బిజెపి లేదా మోడీ వైఖరిపై తమ పార్టీకి పలు నిర్థిష్ట అభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ జాతీయ భద్రతా కోణంలో సరైన విధంగా స్పందించేందుకు తమ పార్టీ సిద్ధం అని, రాజకీయాలను పక్కన పెట్టి ఈ విషయంలో తాము స్పందిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News