మన తెలంగాణ / వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలటూరు గ్రామంలో రూ.2.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్ధిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర అబ్వారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఉన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చెందిన నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇవ్వటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందులో భాగంగానే నేడు మారుమూల గ్రామమైన చిన్నంబావి, వెలటూరు గ్రామంలో ఒక 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు.
వెలటూరు గ్రామంలో రూ.2.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11కెవి సబ్ స్టేషన్ ద్వారా 3 ఫీడర్లతో 950 బోరుబావులు, 600 డొమెస్టిక్ కనెక్షన్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుందని, మూడు ఫీడర్ల కింద 6 గ్రామాలు వెలటూరు, చిన్న మరూరు, అయ్యావారిపల్లి, కాలురు, వెంకటపల్లి, చెల్లెపాడు గ్రామాలకు మూడు ఫేజ్‌ల నాణ్యమైన విద్యత్ అందనుందని, ఆయా గ్రామాల పరిధిలోని గృహ, వ్యవసాయ భూములకు కరెంట్ కష్టాలు తీరనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఇంచార్జీ సుబ్రమణ్యం, టిజి ఎస్‌పిడిసి ఎల్‌ఎస్‌ఈయు బాలస్వామి, డిఈ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయులు జూపల్లి అరుణ్, సింగిల్ విండో చైర్మన్ నరసింహ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ సాగర్‌రావు, కళ్యాణ్ రావు, రామచంద్ర రెడ్డి, కృష్ణ ప్రసాద్, బీచుపల్లి యాదవ్, మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.