న్యూఢిల్లీ: గుజరాత్‌లోని వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై గంభీర వంతెన కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. మరో ముగ్గురు వ్యక్తుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పద్రా పట్టణానికి సమీపంలోని గంభీర గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే నాలుగు దశాబ్దాల నాటి వంతెనలోని ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి.
వడోదర కలెక్టర్ అనిల్ ధమేలియా మాట్లాడుతూ.. “NDRF, SDRF, ఇతర ఏజెన్సీల నుండి 10 బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. ట్రక్కుతో సహా పలు వాహనాలు నది గర్భ బురదలో చిక్కుకున్నాయి. దీంతో వాహనాలను బయటకు తీసుకొచ్చేందుకు కష్టంగా మారింది. ఇప్పటివరకు 17 మంది బాధితుల మృతదేహాలను వెలికితీశారు. మరో ఐదుగురు గాయపడిన వ్యక్తులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. త్వరలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారు” అని చెప్పారు.
నలుగురు ఇంజనీర్ల సస్పెన్షన్
వంతెన కూలిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయబడిన వారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ఎమ్ నాయకవాలా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు యుసి పటేల్, ఆర్టి పటేల్, అసిస్టెంట్ ఇంజనీర్ జెవి షా ఉన్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వంతెనలను వెంటనే తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.