రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ ఈ ఏడాది
ఏప్రిల్ నాటికి 21.27లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణ 2022-23లో 6.71లక్షల
మెట్రిక్ టన్నులు సేకరణ రూ.7,306.46
మన తెలంగాణ / హైదరాబాద్ ః రాష్ట్రంలో ధాన్యం సేకరణ (Grain collection) ఊపందుకుంది. వరుసగా మూడేళ్లలో ధాన్యం కొనుగోలు క్రమంగా పెరిగి మూడేళ్ళలో మూడు రెట్లకు పైగా చేరుకుంది. వాస్తవానికి రబీ సీజన్‌లో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ధాన్యం కొనుగోళ్లు 6.71 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 16.93 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఈఏడాది రభీ సీజన్‌లో రికార్డు స్థాయిలో ఏప్రిల్ చివరినాటికి మూడింతలుగా 21.27 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు చేరుకోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, సన్నవడ్లకు కల్పిస్తున్న రూ.500ల బోనస్ వంటి వాటితో ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్ లో రైతాంగం సాగు చేసిన 57 లక్షల ఎకరాలలో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేశారు. ఈసారి 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది.
దేశంలోనే రికార్డుస్థాయిలో దిగుబడి
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్ లు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యింది. ఇది యావత్ భారతదేశంలోనే అరుదైన రికార్డుగా నమోదు చేసుకుంది. . ఖరీఫ్ సీజన్ లో 66.7 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి (Grain collection) కాగా, ప్రస్తుత రబీ సీజన్ లో 57 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖలు అంచనా వేశాయి. దీంతో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.
ఇప్పటికే 21.27 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
ఏప్రిల్ చివరినాటికి సుమారు 31.51 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరగా, ఇప్పటి వరకు 21.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సన్నాలు పండించిన రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న బోనస్ ఎప్పటికప్పుడు వారి వారి ఖాతాలలో జమ చేస్తున్నారు.
8,329 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ధాన్యం కొనుగోలుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 8,329 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోగా, ఇప్పటికే 7,337 కొనుగోలు కేంద్రాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు(పిఎసిఎస్), ఇందిరా క్రాంతి పథం(ఐకేపి) గ్రూపుల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో పూర్తి స్థాయిలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంబించారు.
రబీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఏజెన్సీ 2021-22 2022—23 2023-24 2024-25
పిఏసిఎస్ 4,229 4,509 4,483 4,612
ఐకెపి 1,930 1,979 2,218 3,324
ఇతరులు 450 549 477 393
మొత్తం 6,609 7,037 7,178 8,329
ఏప్రిల్ 30వ తేదీ వరకు రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు వివరాలు
సంవత్సరం ధాన్యం సేకరణ
రబీ 2022-23 6.71 లక్షల మెట్రిక్ టన్నులు
రబీ 2023-24 16.93 లక్షల మెట్రిక్ టన్నులు
రబీ 2024-25 21.27 లక్షల మెట్రిక్ టన్నులు
Grain procurement