మనతెలంగాణ/ దుమ్ముగూడెం: మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో రెండేళ్లకు ఒకసారి నిర్వహించే గ్రామ దేవతల జాతర మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవవంగా వేడుకలు జరిగాయి. జాతర మహోత్సవంలో భాగంగా తొలిపండుగగా మరిడమ్మ జాతర మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆదివారం ఉదయాన్నే అమ్మవార్ల ప్రతిరూపాలైన శక్తి స్వరూపాలు పూనకాలతో మేళ తాళాల నడుమ డప్పు, సన్నాయి వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఘనంగా మరిడమ్మ తల్లికి ఆహ్వానం పలికారు. చేతిలో వేపాకు రెబ్బలు, ముఖమంతా పసుపుతో ఎర్రటి కుంకుమ బొట్టుగా ధరించి ఆది పరాశక్తులు నృత్యాలు చేస్తుంటే భక్తులు మరిడమ్మ సేవలో పాలుపంచుకున్నారు.
అమ్మవార్లకు 108 బిందెలతో పసుపు, కుంకుమ, కలిపిన నీళ్లతో నిండు స్నానాలు జాలాభిషేకంగా గ్రామంలోని భక్తులు నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి మరిడమ్మ తల్లికి పూజల గది వద్ద ప్రత్యేకమైన పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మరిడమ్మ తల్లి స్వరూపంగ గరుడ దీపాన్ని అమ్మవారి స్వరూపంలో ఉన్న దేవర బాల శిరస్సును పెట్టుకుని గ్రామ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా వెళ్లి భక్తుల ఇంట ప్రత్యేక పూజలను అందుకున్నారు. మరిడమ్మ వృక్షం వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఘనమైన పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ, అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, హరిబాబు, గోసుల వెంకటేశ్వరరావు, కృష్ణారెడ్డి, అప్పన్న, మద్ది రాము రెడ్డి, రామ్‌మోహన్ రెడ్డి, శ్రీనివాస్, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.