ప్రావిడెన్స్ (గయానా): గ్లోబల్ సూపర్ లీగ్ 2025లో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ షిమ్రాన్ హెట్మైర్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. ఈ లీగ్ లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్, హోబర్ట్ హరికేన్స్ జట్లు తలపడ్డాయి. గయానా తరపున బరిలోకి దిగిన హెట్మైర్ సిక్సర్ల మోత మోగించాడు. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ జట్టు కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో గయానాకు బిగ్ షాక్ తగిలింది. అయితే, 42 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ సమయలో బ్యాటింగ్ కు దిగిన హెట్మైర్.. ప్రత్యర్థి బౌలర్ ఫాబియన్ అలెన్ కు చుక్కలు చూపించాడు. అతను వేసిన 10వ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. హెట్మైర్ మొత్తం 10 బంతుల్లో 39 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తర్వాత మోయిన్ అలీ, గుడకేష్ మోటీ మిగతా పని పూర్తి చేశారు. దీంతో గయానా నాలుగు వికెట్ల తేడాతో హోబర్ట్ జట్టును ఓడించింది. ఈ విజయంతో గయానా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.