Wednesday, September 10, 2025

ఆ‘పన్ను’లకు ప్రయోజనమెంత?

- Advertisement -
- Advertisement -

సాధారణంగా పండుగల వేళ వ్యాపారాలు డిస్కౌంట్ సేల్ ప్రకటిస్తుంటారు. ఈసారి ఈ కార్యం కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది. జిఎస్‌టి స్లాబ్ ల సవరణలపై కేంద్ర వస్తువుల, సేవల పన్నుల మండలి సిఫారసులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. దసరా నవరాత్రుల తొలి రోజు అయిన ఈ నెల 22వ తేదీనుండి అవి అమలులోకి వస్తాయని ఆమె తెలిపారు. ఈ తగ్గింపుతో సర్వత్రా హర్షంతో కూడిన సందడి మొదలైంది.

వాస్తవానికి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసినట్లు కనిపిస్తాయి కానీ ఆ నిర్ణయాల వెనుక ఎన్నో మతలబులు ఉంటాయి. రాజకీయ పార్టీలకు పారిశ్రామికవేత్తల నుండి వందల కోట్ల విరాళాలు వస్తుంటాయి. అందుకు బదులుగా పాలకులు ఆ వ్యాపారులకు మేలు చేయక తప్పదు. ఏ వస్తువులైతే అమ్మకాలు లేక పారిశ్రామికవేత్తల గోడౌన్లలో కదలని స్టాక్‌గా మూలుగుతుంటాయో ఆ వస్తువుల ధరలపై పన్ను తగ్గించి, మార్కెట్లో వాటి కొనుగోళ్లు పెంచి, ప్రభుత్వాలు వారి రుణం తీర్చుకుంటాయి.

Also Read: జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?

జిఎస్‌టి తగ్గింపువల్ల సామాన్యులకు వస్తువుల ధరలు అందుబాటులో రావడం కన్నా వ్యాపారులకు అమ్మకాలు మాత్రం పెరుగుతాయి. వస్తువు అమ్మకంపై వ్యాపారికి రావలసిన సొమ్ము పూర్తిగా వస్తుంది. వారి లాభం పైసా తగ్గదు. మరోవైపు ప్రభుత్వ రాబడి తగ్గిపోతుంది. 2024 25 ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టి రాబడి దాదాపు రూ. 21 లక్షల కోట్లు. జిఎస్‌టి సవరణల వల్ల సుమారు రూ. లక్ష కోట్ల మేరకు తగ్గుదల ఉంటుందని గణాంకాలు తేల్చాయి. పన్నురాబడి తగ్గితే ప్రభుత్వాలు ప్రజలకు చేసే సేవల్లో కోత పడుతుంది. ఖజానా రాబడిని త్యాగంచేసే ఈ చర్యవల్ల ప్రభుత్వం వ్యాపారులకు పరోక్షంగా లాభం చేసినట్లే. అందుకే ఈ సీజన్ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ సేల్‌గా భావించాలి.

కొత్త జిఎస్‌టి విధానం ప్రకారం ఇదివరకున్న నాలుగు స్లాబ్‌ల్లో రెండు పోయి, ఇక ముందు 12%, 18% మాత్రమే ఉంటాయి. 5%, 28% స్లాబ్ పన్ను వర్తించే వస్తువులను మిగతా రెండు స్లాబ్‌ల్లో సర్దుబాటు చేస్తారు. కొన్ని వస్తువుల కోసం కొత్తగా 40% స్లాబ్‌ను తెచ్చిన విషయానికి మాత్రం పెద్దగా ప్రచారం ఇవ్వడం లేదు. 10% జిఎస్‌టి తగ్గడం వల్ల కార్లు, బైకులు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎసిలు ఇక చౌకగా లభిస్తాయని లెక్కలు చెబుతున్నాయి. అంటే 28% నుండి 18% కి మారిన జాబితాలోని వేయి రూపాయల వస్తువు ఇకముందు రూ. 9 వందలకు లభించాలి. అది సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బొగ్గుపై 5% ఉన్న స్లాబ్‌ను ఏకంగా 18%కి మార్చారు. పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ ధర బొగ్గు ధరపై ఆధారపడి ఉంటుంది. రూ. 105కు లభ్యమయ్యే బొగ్గుకు ఇకనుంచి రూ. 118 వెచ్చించాలి. అలా వస్తు ఉత్పత్తి ఖర్చు పెరగడంతో వస్తువు ధరపై దాని ప్రభావం పడుతుంది. స్లాబ్ తగ్గినా వస్తువు ధర పెరగడం వల్ల కొనుగోలుదారులకు దక్కే ప్రయోజనం చెప్పినంతగా ఉండకపోవచ్చు. మటన్‌పై పన్ను తగ్గించి మేక మేతపై పన్ను పెంచినట్లుంది ప్రభుత్వం తీరు.

ఇక కొత్తగా ప్రవేశపెట్టిన 40% స్లాబ్ విషయానికొస్తే- దాని పరిధిలోకి పాన్ మసాలా, గుట్కా, సిగరెట్, బీడీ, జర్దా, పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు వస్తాయి. ఇదివరకు వీటికి 28% టాక్స్ వర్తించేది. మరిన్ని రకాల వడ్డింపులు కలిసి ఈ వస్తువుల ధరపై మొత్తంగా 88% పన్ను భారమే ఉంటుంది. ఇంతగా వీటిని ప్రియం చేయడానికి కారణం వాటి వాడకాన్ని తగ్గించడమే అని ప్రభుత్వం చెబుతోంది. సిగరెట్ ధర పెరిగిందని తాగేవాడు తగ్గిస్తాడని, మానేస్తాడని నమ్మలేము. అదొక అలవాటు. మరో అవసరమైన చోట ఖర్చు తగ్గిస్తారు తప్ప వీటి వాడకం తగ్గించడం కష్టం. ఈ రోజుల్లో వస్తున్న సినిమాల్లో పాత్రధారులు ఆఫీసుల్లో, బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా దమ్ము లాగేస్తున్నారు. పోలీసు పాత్రలైతే మరీ ఎక్కువ. ‘హానికరం’ అనే ప్రకటన కూడా స్క్రీన్‌పై కనపడదు.

సెన్సార్ సమయంలో వీటిని కట్టడి చేయాలి. ఇలాంటి దురలవాట్లకు ప్రోత్సహించే సినిమాలకు అవార్డులు ఇవ్వకూడదు. ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసి తాగితే కష్టార్జితాన్ని లాగేసుకుంటామని సామాన్యుడి వెంటపడడం సరికాదు. మరో విషయమేమంటే- ఇప్పుడు 40% స్లాబ్‌లోకి వచ్చిన వాటిలో నకిలీ సరుకే ఎక్కువ. అక్రమ రవాణాకు కొదువే లేదు. తక్కువ ధరకు ఏది దొరికితే దాన్నివాడతారు. అలా నకిలీ సరుకు మార్కెట్లో వెల్లువెత్తే ప్రమాదం ఉంది. వాటిని కట్టడి చేసేంత మంది మార్బలం ఆ శాఖకు లేదు. పట్టుబడ్డ దానికన్నా ఎంతో ఎక్కువ దొంగ సరుకు వినియోగదారులకు చేరుతోంది.ఏ రకంగా చూసినా 40 % స్లాబ్ ఓ ప్రమాదకర సూచికగానే కనబడుతోంది. దురలవాట్ల మాన్పింపుకు ఔషధంగా భావిస్తున్న ఈ భారమైన స్లాబ్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News