అమెరికా టారిఫ్‌ల వేళ ఇది దేశ ఆర్థిక వృద్ధి చక్రానికి నాంది: పరిశ్రమ
న్యూఢిల్లీ : జిఎస్‌టి రేట్ల సరళీకరణ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చక్రానికి జోష్ ఇవ్వనుందని, వినియోగం మరింత పెరగనుందని పరిశ్రమ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన అమెరికా టారిఫ్‌లతో ఎదురుగాలులను తట్టుకునేందుకు జిఎస్‌టి సంస్కరణలు ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయని అంటున్నారు. బుధవారం జరిగిన సమావేశంలో కౌన్సిల్ పన్ను రేట్లను 5 శాతం, 18 శాతం మాత్రమే ఉండేలా మార్పులు చేసింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే నవరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పరిశ్రమ నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది వినియోగాన్ని పెంచడమే కాకుండా అమెరికా టారిఫ్ విధానాల ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం : హిందూజా గ్రూప్
జిఎస్‌టి రేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని కల్పిస్తాయని, గ్రామీణ స్థాయిలో డిమాండ్ పెరుగుదలకు దోహదం చేస్తాయని హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ పి. హిందూజా అన్నారు.
మరిన్ని సంస్కరణలు చేయాలి: ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ, మరిన్ని సంస్కరణలు వేగంగా అమలు చేయాలని, అవే వినియోగాన్ని పెంచి పెట్టుబడులను ఆకర్షించి దేశ ఆర్థిక శక్తిని పెంచుతాయని వ్యాఖ్యానించారు.
వివాదాలను తగ్గిస్తుంది: ఫిక్కీ
పన్ను నిర్మాణ సరళీకరణ వర్గీకరణ వివాదాలను తగ్గిస్తుందని, అనుసరణను మెరుగుపరుస్తుందని, తలకిందులైన డ్యూటీ నిర్మాణం వల్ల ఉన్న సమస్యలను పరిష్కరిస్తుందని ఫిక్కీ అధ్యక్షుడు హర్ష వర్ధన్ అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఆర్థిక భావజాలంలో మార్పుని తీసుకురావడం ద్వారా వినియోగ డిమాండ్‌ను పెంచి వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణలో తోడ్పడుతుందని తెలిపారు.
మధ్యతరగతికి లాభం : సిఐఐ
అవసరమైన వస్తువులు, పాల ఉత్పత్తులు, మందులు, రోజువారీ వినియోగ సరుకులపై జిఎస్‌టి తగ్గింపులు వినియోగదారులు, మధ్యతరగతి, పరిశ్రమలకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తాయని సిఐఐ ఆర్థిక వ్యవహారాల కౌన్సిల్ చైర్మన్ ఆర్. దినేష్ అన్నారు.
వినియోగాన్ని పెంచుతుంది: ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రాజనీష్ కుమార్ ప్రకారం, పండుగ సీజన్ ముందు ఈ సంస్కరణలు వినియోగాన్ని పెంచి మార్కెట్ యాక్సెస్ విస్తరింపజేస్తాయని చెప్పారు.
జిఎస్‌టి మరింత పటిష్టం: ఎన్‌ఎస్‌ఇ ఎండి
జిఎస్‌టి ప్రవేశపెట్టడమే భారత చరిత్రలో అతిపెద్ద సంస్కరణ అని, తాజా చర్యలు దానిని మరింత బలపరుస్తాయని ఎన్‌ఎస్‌ఇ ఎండి అశీష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.
జిఎస్‌టి వృద్ధి 6.5% వద్దే : ఇక్రా
ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ ప్రకారం, సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టి ఆదాయాలు డబుల్ డిజిట్ పెరిగినా, ఐజిఎస్‌టి, సెస్ వసూళ్లు మందగించడంతో జిఎస్‌టి మొత్తం వృద్ధి 6.5 శాతం వద్దే నిలిచిందని తెలిపారు.
పరిశ్రమలకు మద్దతు: ఇన్‌క్రెడ్ సిఇఒ
ఇన్‌క్రెడ్ వెల్త్ సిఇఒ నితిన్ రావు శ్రామిక ఆధారిత పరిశ్రమలకు మద్దతు ఇచ్చేందుకు, వస్తువులు చౌకగా చేయడానికే ఈ చర్యలు అనుకున్నారని అన్నారు.
ఆర్థిక వృద్ధికి ఊతం: ముత్తూట్ మైక్రోఫిన్
ఆర్‌బిఐ వడ్డీ రేటు కోతతో పాటు జిఎస్‌టి హేతుబద్ధీకరణ ఆర్థిక వృద్ధికి బలమైన ఊతమిస్తుందని ముత్తూట్ మైక్రోఫిన్ సిఇఒ సదఫ్ సయీద్ అన్నారు. పండుగ సీజన్‌లో ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులపై పన్ను తగ్గింపు పరిశ్రమకు గొప్ప ఊతమిస్తుందని మార్స్ రిగ్లీ ఇండియా జనరల్ మేనేజర్ అహ్మద్ అబ్దెల్ వహాబ్ అభిప్రాయపడ్డారు.