నేడు రాజస్థాన్ రాయల్స్‌తో పోరు
జైపూర్: వరుస విజయాలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ (RR vs PBKS) ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఐపిఎల్ తొలి దశలో పంజాబ్ అసాధారణ ఆటతో అలరించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ రేసులో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్‌కు నాకౌట్ బెర్త్ దాదాపు ఖాయమవుతోంది. ఇక రాజస్థాన్ ఇప్పటికే నాకౌట్‌కు దూరమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా పెద్దగా కలిగే ప్రయోజనం ఏమీ లేదు. అయితే మిగిలిన మ్యాచుల్లో గెలిచి కాస్తయిన ఊరట పొందాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ సమతూకంగానే ఉంది. అయితే సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది.
కెప్టెన్ రియాన్ పరాగ్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, హెట్మెయిర్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా వీరు తమతమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది ఇంకా తేలలేదు.
ఇలాంటి స్థితిలో జట్టు బ్యాటింగ్ భారాన్ని మోయాల్సిన బాధ్యత కెప్టెన్ పరాగ్‌పై (RR vs PBKS)నెలకొంది. యువ ఓపెనర్లు వైభవ్, యశస్విలు కూడా మెరుపు ఆరంభాన్ని ఇవ్వక తప్పదు. హెట్మెయిర్, జురెల్, హసరంత తదితరులు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. బౌలర్లు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. అప్పుడే రాజస్థాన్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ జోరుమీదున్నారు. ఈ సీజన్లో వీరిద్దరు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరు తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్ల బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రియాంశ్ ఇప్పటికే కళ్లు చెదిరే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ రెండో దశలోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రభ్‌సిమ్రన్ కూడా అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు.
పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టును ముందుండి నడపిస్తున్నాడు. అసాధారణ కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. బ్యాట్‌తో కూడా శ్రేయస్ రాణిస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. నెహాల్ వధెరా, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. స్టోయినిస్, మార్కొ జాన్సెన్ తదితరులు ఈ మ్యాచ్‌లో ఆడతారా లేదా ఇంకా తేలలేదు. బౌలింగ్‌లోనూ పంజాబ్ బాగానే ఉంది. యుజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్, యశ్ ఠాకూర్ వంటి ప్రతిభావంతులైన బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.