తొంగి చూస్తున్న నింగికి
నేల మేనుపై మోరు కట్టిన
కురుపులా ఉంది గుడిసె
మండుతున్న సూర్యుడికి
ఈదరతో చీదరతో చివికి పోయిన
తాటాకుల గొడుగులా ఉంది గుడిసె
మెరుస్తున్న వెన్నెలకి
ధూళికి దూసరానికి బూజు పట్టిన
జిబ్బిలా ఉంది గుడిసె
చీకటి, చిత్తడికి ఆకలిని కప్పుకున్న
అనాధలా ఉంది గుడిసె
చెమట ముసురు మనుషుల్ని
విరిపాకపు పలుకుల్ని నౌజులూరు
మనసుల్ని నల జీలకర్ర మొగ్గ నవ్వుల్ని
శిరిశింపూల చూపుల్ని
పుటికిన ముంజూరు పరకలే
శిరస్సులోంచి పలకరిస్తాయి
సత్తు గిన్నెలు, సిల్లు పెంకుల చప్పుల్లే
కూనిరాగాలకు త్రిపుట
తాళాల దరువులవుతాయి
గోనె పట్టాలే జలతారు పరదాలై
రెపరెపలాడుతాయి
మాసిన తుండు గుడ్డలే సిరికంచు
కుచ్చీలై ఒంటిపై జీరాడుతాయి
పీతువాసనలే శ్వాసకు ఇంపైన
పూలవసంతాలై ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
బొడ్డమానులా
దండగమారి బతుకై మిగలక
మెరక దిబ్బపై పెరిగిన తాటి పెండిలా
తల్లి సారం పంచే గుడిసెగాడ్పున పడ్డ
తోవసారికి సలువ పందిరై సేదదీర్చే గుడిసె
కరువు కన్నీరొలుకుతున్నా
పొరుగు పేగులో గప్పెడు ముద్దగా
త్యాగమయ్యే గుడిసె
పాకులాటని పీకులాటని
బడుగు కావిడిగా మోస్తున్న గుడిసె
పసిరిక మోపుగానో
గింజమూటగానో చాకిరి పిట్టై
గెద్దల గాది నింపుతున్న గుడిసె
ధవళ కాంతుల తారళ్యంలో
వెలిగిపోతున్న ఊరికి పొలిమేరన
మసి పేరిన మైల దీపమైన గుడిసె
ధైన్యం దహిస్తున్నా ఎలబారని
గుండె నిబ్బరం ఆ.. గుడిసె
మేలు కాలం కోసం కంటి వత్తులెలిగించి
ఎల్లకాలం అలుపులేని ఎదురు చూపు
ఆ.. గుడిసె
కలమట దాసు బాబు