ఎపిలోని నెల్లూరులో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపడం, సినిమా లెవెల్లో ఛేజింగ్ సీన్ చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రాజమండ్రికి చెందిన ప్రకాష్ అనే నిందితుడు తన కారులో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఈగల్ టీం, స్థానిక పోలీసులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే ప్రకాష్ పారిపోవడానికి యత్నించడంతో సినిమా తరహాలో ఛేజింగ్ జరిగింది. వాహనం వేగంగా నడుపుతూ ప్రకాష్ పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ ఫిరోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రాణ రక్షణ కోసం సిఐ సాంబశివరావు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం.ఆ తర్వాత ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని కారు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రకాష్‌పై ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి రవాణా నెట్‌వర్క్‌లో ముఖ్య వ్యక్తిగా గుర్తించినట్లు కూడా చెప్పారు. ఈ ఘటనపై ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈగల్ టీం 23,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్ పేరుతో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు గంజాయి అందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఒడిశా నుంచి గంజాయి రాకుండా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో కూడా డ్రోన్లతో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని వివరించారు. ప్రజలు గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై సమాచారాన్ని 1972 నంబర్‌కు తెలియజేయాలని ఐజీ రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు.