ఈ యేడాది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025ను దీప బష్టి ఆంగ్లంలోకి అనువదించిన బాను ముష్తాక్ కన్నడ కథా సంకలనం ‘హార్ట్ ల్యాంప్’కు ప్రకటించారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వారు ఈ కథా సంకలనాన్ని ప్రచురించారు. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి కన్నడ పుస్తకం ఇది. ఈ పురస్కారం గెలుచుకున్న తొలి కథానికల సంకలనం కూడా ఇదే. 2022లో గీతాంజలి శ్రీ ‘టూం బ్ ఆఫ్ సాండ్‘గెలుచుకున్న తర్వాత బుకర్ ప్రైజ్ గెలిచిన భారతీయ భాషలో వచ్చిన రెండవ సా హిత్య పుస్తకం కూడా ఇదే. ఈ పుస్తకానికి 2024లో ఇంగ్లీ ష్ పెన్ అనువాద అవార్డు కూడా లభించింది.
హార్ట్ లాంప్ (గుండె దీపం) 12 చిన్న కథల సంకలనం. ఈ కథలను బాను ముష్తాక్ 1990 నుండి 2023వరకు మూ డు దశాబ్దాల కాలంలో రాశారు. ఈ కథలు దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజానికి చెందిన మహిళలు, బాలికల దైనందిన జీవితాలను, వారి కష్టాలను, వారి ప్రతిఘటనను, వాళ్ళ చాకచక్యాన్ని, తెలివిని, వాళ్ళ మధ్య మానవ సంబంధాల్ని, స్త్రీత్వాన్ని వివరిస్తాయి. పితృస్వామ్య సమాజంలో, ముఖ్యంగా ముస్లిం సమాజంలో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను, మతం, సమాజం, రాజకీయాలు వారిపై విధించే అణచివేతను, క్రూరత్వాన్ని ఈ కథలు స్పష్టంగా చిత్రీకరిస్తాయి. ఈ కథల్లో హాస్యం, జీవన మాధుర్యం, హృదయాన్ని తీవ్రంగా కదిలించే అంశాలు, స్పష్టమైన వ్యావహారిక శైలి కనిపిస్తాయి. చదివించే లక్షణం గొప్పగా ఉన్న కథలివి.
1948లో కర్ణాటక రాష్ట్రంలో హసన్ పట్టణం లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను ముష్తాక్ శివమొగ్గలో కన్నడ మిషనరీ పాఠశాలలో కన్నడ నేర్చుకుని రాయడం మొదలు పెట్టింది. తర్వాత ముస్లిం సమాజం ఆంక్షలను ధిక్కరిస్తూ విశ్వవిద్యాలయానికి వెళ్లింది. 26 ఏండ్లకు ప్రేమ వివాహం చేసుకుంది. లంకేష్ పత్రికకు పాత్రికేయురాలిగా, సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా చాలా క్రియాశీలకంగా పనిచేసింది. మత ఛాందసవాదానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం ముఖ్యంగా ముస్లిం మహిళల హక్కుల కోసం అలుపులేని పోరాటం చేస్తున్నది. తన పోరాట జీవితంలో భాగంగా గొప్ప సాహిత్యా న్ని సృష్టించింది. ముస్లిం మహిళల్ని మసీదు లోకి రానివ్వాలి అని పోరాడినందుకు ఆమె మూడు నెలలపాటు సామాజిక బహిష్కారాన్ని ఎదుర్కొంది.
సామాజిక ఆర్థిక అన్యాయాలను చురుగ్గా ఎదుర్కొంటూ వాటిని రూపుమాపడానికి మొదలైన ‘బందాయ’ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొం ది. ఆమె తన కథలకు స్ఫూర్తి ప్రజల నుండే వచ్చిందని చెబుతారు. మహిళలు తమ సమస్యలతో తన వద్దకు వచ్చినప్పుడు, వారి బాధలు, నిస్సహాయత, కోపం తన కథలకు ప్రేరణగా నిలిచాయని అంటా రు. బాను ముష్తాక్ ఇప్పటి దాకా ఆరు చిన్న కథల సంకలనాలు, ఒక నవల, ఒక వ్యాస సంకలనం, ఒక కవితా సంకలనం వెలువరించారు. కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, దానా చింతామణి అట్టింబె అవార్డు, 2024 PEN ఇంగ్లీష్ అనువాద అవార్డులను గెలుచుకున్నారు.
‘హార్ట్ ల్యాంప్’ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం ద్వారా, బాను ముష్తాక్, కన్నడ సాహిత్యం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ విజయం జీవన వైవిధ్యం, కథ చెప్పే శక్తికి ఒక నిదర్శనం. ముష్తాక్ కథలు గొప్ప వైవిధ్యంతో కూడిన భారతీయ సమాజాన్ని సజీవంగా చిత్రిస్తాయి. సాధారణ భారతీయ మహిళల్లా ముష్తాక్ మహిళలు తమ ప్రపంచంలో ఒక ప్రత్యేక కోణంలో, గృహ, పితృస్వామ్యంలోని అనేక ఒత్తిళ్లతో పోరాడుతారు. ఒక చిన్న కథ లోని చిన్న జాగాలో ముస్లిం వైవాహిక జీవితంలోని అంతులేని భారాలు, స్త్రీ ద్వేషం, స్త్రీలపై అంతులేని హింస , తలాక్ తలాక్ తలాక్‌ల అభద్రత హింస, తల్లిదండ్రుల మద్దతు లేకపోవడం, బాధల్ని తప్పించుకోవడానికి అనేకానేక ఆటంకాలు కలిగించే మతచాందస పురుషస్వామ్య పరిమితులను ధిక్కరిస్తూ కథానాయికలు సంధిస్తున్న ప్రశ్నలు సజీవంగా ఉంటాయి.
నరేన్