జబ్బుకు చికిత్స చేయడం కన్న అసలు జబ్బులే రాకుండా నిరోధించగలగడం, అందుకోసం కృషి చేయడం మంచిది. ఇది వాడి వాడి అరిగిపోయిన సామెత. అయితే ఇంతకన్న మంచి వాక్యం కనిపించలేదు. ఈ సామెత కేవలం ఆరోగ్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. సమాజ రుగ్మతలకు కూడా ఇది వర్తిస్తుంది. అదే విధంగా సమాజంలో ఉత్పన్నమయ్యే అశాంతికి, ఇతర సమస్యలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా, ప్రజలు అసంతృప్తితో చేసే ఆందోళనలపై ప్రభుత్వం తమ బలాన్ని, బలగాలను ప్రయోగించడం వల్ల ధన, ప్రాణ నష్టం జరుగుతున్నది. ఉద్యమాలను, ఆందోళనలను ప్రతిష్ఠగా తీసుకొని ఎంత గొప్పగా వాటిని అణచివేశామో చెప్పుకోవడం ప్రభుత్వాలకు పరిపాటైపోయింది. దీనికి ఏ ప్రభుత్వాలు మినహాయింపు కాదు. ఇప్పటి వరకు పాలించిన, పాలిస్తున్న అన్ని రాజకీయ పార్టీలది ఒకే దారి. ఇందులో డిగ్రీలలో తేడాలుండవచ్చు. కాని ఆలోచనల్లో, ఆచరణలో పెద్ద తేడా లేదు. గత రెండు రోజుల క్రితం చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది నక్సలైట్లు మరణించారు.
సైన్యం నుంచి ఒక జవాన్ చనిపోయారు. అయితే దీనిని ప్రధాన మంత్రి స్వయంగా నక్సలైట్ల మీద సాధించిన గొప్ప విజయంగా ప్రకటించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు కూడా ఈ కాల్పుల్లో చనిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన మావోయిస్టులకు పెద్ద దెబ్బగా, ప్రభుత్వానికి గొప్ప విజయంగా పరిశీలకులు భావిస్తున్నారు.ఇటీవల అంటే గత నెల ఏప్రిల్ 10వ తేదీన కేంద్ర హోం శాఖ ఒక సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేసింది. అందులో ఇటీవల తగ్గిన నక్సలైట్ల హింస గురించి పేర్కొంటూనే వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు సంపూర్ణంగా నక్సలిజాన్ని నిర్మూలిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయానికి విరుద్ధంగా సొంత ప్రజలపైన సరిహద్దులను కాపలా కాసే సైన్యాన్ని దింపింది. అన్ని రకాల సైనిక చర్యలను జరపడానికి నిశ్చయించింది. మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఎక్కడైతే కేంద్రీకరించి పని చేస్తుందో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.
ఇటీవల జరిగిన సైన్యం దాడితో చాలా మంది నక్సలైట్లు మరణించారు. ఈ దాడుల్లో సైన్యం వైపు నుంచి తక్కువ నష్టం జరిగింది. అంటే సైన్యం చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే టార్గెట్స్‌ను గుర్తించి దాడులు చేస్తున్నట్టు అర్థమవుతోంది. అందువల్లనే ప్రభుత్వం ఒక డెడ్‌లైన్ పెట్టుకుని పని చేస్తున్నది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో అంటే మావోయిస్టు పార్టీ గత 40 ఏళ్ల సాయుధ ప్రస్థానంలో ఎటువంటి విధానాలను అవలంబించింది, ఏ విధమైన ఆచరణ ఇటువంటి ఫలితాలకు దారి తీసిందనే విషయంపైన ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. ఇప్పుడు మావోయిస్టు పార్టీపైన ప్రభుత్వం పైచేయి సాధించిందనేది రూఢి అవుతున్నది. అయితే ఇక్కడే ప్రభుత్వం తగిన విధంగా ఆలోచించాల్సి ఉంది. గత పదేళ్లలో నక్సలైట్ల దాడులు తగ్గినట్టు, నక్సలైట్లు వందల సంఖ్యలో చనిపోయినట్టు, వేల సంఖ్యలో లొంగిపోయినట్టు లెక్కలు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ సమయంలో ప్రభుత్వం కొంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించి, మరింత హింస పెరగకుండా నక్సలైట్లతో చర్చలు జరిపి ప్రభుత్వ బాధ్యతను నెరవేరిస్తే బాగుంటుందని ప్రజాస్వామికవాదులు ఆశించడంలో తప్పులేదు. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో ఆదిమ తెగలు జరుపుతున్న సాయుధ తిరుగుబాటు విషయంలో అక్కడి ప్రభుత్వం స్పందించి, చర్చలు జరిపింది. శాంతిని నెలకొల్పింది. అక్కడి ఉద్యమకారులను ప్రజాస్వామ్య విధానంలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నది మెక్సికో మనందరికి తెలుసు. అగ్రరాజ్యమైన అమెరికాకు ఆనుకొని ఉంటుంది. అమెరికా అనుకున్న, మెక్సికో ప్రభుత్వం నిర్ణయించుకున్న చియాపాస్‌లో జపాటిస్టా సాయుధ మిలిటెంట్లను ఒక్క గంటలో తుడిచిపెట్టగలదు. కాని మెక్సికో ప్రభుత్వం అనుసరించిన ప్రజాస్వామ్య అనుకూల వైఖరి వల్ల అక్కడి హింస ఆగిపోయింది. అదే విధం గా అయిదు దేశాలు టర్కీ, ఈజిప్టు, సిరియా, ఇరాన్, ఇరాక్ దేశాలను కలిపిన ప్రాంతంలో చాలా ఏళ్లుగా కుర్దిస్తాన్ కోసం సాయుధ పోరును సాగిస్తున్న సంస్థ తమ సాయుధ పోరును విరమించుకున్నట్టు ఇటీవల మనం వార్తలు చదివాం. ఈ రెండు సంఘటనలు అక్కడి ప్రజల, తిరుగుబాటు సంస్థల ప్రజాస్వామ్య వైఖరిని సూచిస్తున్నాయి.
భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నాం. దానికి అనుగుణంగా కొంతలో కొంతైనా తమ ఆలోచనలను మార్చుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తే మంచిది. రాబోయే పరిణామాలు ఎలా ఉన్న నక్సలైట్ ఉద్యమం లేవనెత్తిన కొన్ని విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 1960 దశకం చివరలో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం కేవలం వ్యక్తుల, సంస్థల ఆలోచనల నుంచి పుట్టింది కాదు. అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుల వివక్ష, దోపిడీ, దౌర్జన్యాలు, అదే విధంగా అడవీ ప్రాంతాల్లో ఫారెస్టు అధికారులు, వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాముల దోపిడీ కారణాలు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో దళితులు, ఇతర వెనుకబడిన కులాలు, అదే విధంగా ఆదివాసులు తాము ఎదుర్కొంటున్న దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించడానికి సిద్ధమయ్యారు. దానికి నక్సలైట్ పార్టీలు తోడ్పాటును ఇచ్చాయి. అంతేకాని నక్సలైట్లు ప్రేరేపిస్తే ఉద్యమాలు రాలేదు. ఇది సత్యం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో నక్సలైట్ ఉద్యమం ఆనాటి పరిస్థితుల వల్ల ప్రత్యేకించి పోలీసు నిర్బంధం, ఆ ప్రాంతాల్లో వచ్చిన సామాజిక మార్పులు, నక్సలైట్ పార్టీలు అనుసరించిన విధానాల వల్ల నక్సలైట్ ఉద్యమం తగ్గుముఖం పట్టింది. అయితే ప్రస్తుతం చర్చించుకుంటున్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో మొదట అంటే 1960 80 మధ్యలో నక్సలైట్ ఉద్యమం లేదు. 1990 తర్వాతనే అక్కడ నక్సలైట్లు ప్రవేశించారు. ఇక్కడ నేను ఒక స్వీయానుభవం చెప్పాలి. 1991 92 ప్రాంతంలో నేను ఇంకో ఇద్దరు జర్నలిస్టు మిత్రులం కలిసి చత్తీస్‌గఢ్‌లోని కుంట ప్రాంతానికి ఆదివాసుల సమస్యలపైన రిపోర్టు రాయడానికి వెళ్లాను. మమ్మల్ని చూసి అక్కడి పశువులు తనుగులు తెంపుకొని పారిపోయాయి. అక్కడి మనుషులు గుడిసెల్లో నుంచి బయటకు రాలేదు. ఎందుకంటే వాళ్లకు బయటి వ్యక్తులతో పరిచయాలు లేవు.
రెండోది అప్పుడు అక్కడి ఆదివాసీ మహిళలకు శరీరం నిండా బట్టలు వేసుకునే అవకాశం లేదు. మేము కూడా వాళ్లను బయటకు రమ్మని అడగలేదు. కొంత మంది మగవాళ్లతోనే మాట్లాడాం. ఇది ఎందుకు చెప్పుతున్నానంటే ఆదివాసులలోకి నక్సలైట్లు వెళ్లి వాళ్లను సమీకరించడానికి అనుకున్న పరిస్థితులే కారణం. అప్పటి వరకు ఆ ప్రాంతానికి ప్రభుత్వమే వెళ్లలేదు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు లేవు. బయటి మనుషులు ఎట్లా ఉంటారో వాళ్లకు తెలియదు. అటువంటి ప్రాంతానికి నక్సలైట్లు వెళ్లి అక్కడి ప్రజలను సమీకరించి వాళ్లను చైతన్యం చేశారని గత అనుభవం చెబుతున్నది. ఒకవేళ అక్కడికి ప్రభుత్వం వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకొని పరిష్కరించగలిగి ఉంటే, ఈ రోజు సాయుధ నక్సలైట్లను నిర్మూలించే అవసరం ఉండేది కాదు. గత కొన్నేళ్ల వందల మంది అసువులు బాసే దుర్గతి పట్టి ఉండేది. అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు, సామాన్య పౌరులు మరణించే దారుణాన్ని మనం చూసి ఉండేవాళ్లం కాదు. ప్రస్తుతం వందల, వేల కోట్లతో రోడ్లు, ఇతర పనులు చేయడం, ఎన్నో మౌలిక వసతులు కల్పించడానికి చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నది.
అయితే ముఖ్యంగా భారత దేశంలోని ఆదివాసులు గత వందల ఏళ్లుగా రాజులు, ప్రభుత్వాలతో ఎన్నో దారుణాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. రాజులు కావచ్చు, బ్రిటిష్ వాళ్లు కావచ్చు. ప్రస్తుతం మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావచ్చు. ఇప్పటికీ వాళ్ల స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని గుర్తించలేదు. వాళ్ల భూముల మీద, వాళ్ల అడవీ సంపద మీద కన్నేసినప్పుడల్లా ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో నిజానికి శాంతి కావాలంటే వాళ్లు మొదటి నుంచి నినదిస్తున్న జల్, జంగిల్, జమీన్ మీద తమకు మాత్రమే హక్కులు ఉండాలనే వారి ప్రజాస్వామ్య కాంక్షను గౌరవించాలి. భారత రాజ్యాంగం అందించిన హక్కులను ఎటువంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలి. అంతేగాని కేవలం సాయుధ సైన్యాలు, నిర్బంధాలు నిజమైన ఫలితాలను అందించలేవు. అటు ప్రభుత్వం, ఇటు నక్సలైట్ సంస్థలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే శాంతికి పునాది పడుతుంది.
- మల్లేపల్లి లక్ష్మయ్య ( దర్పణం)