Wednesday, May 21, 2025

సిఎం రేవంత్ రెడ్డి చెంచుల గొంతు నొక్కారు:గువ్వల బాలరాజు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట నియోజకవర్గం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ రెడ్డి చెంచుల గొంతు నొక్కారని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు అన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం తన నియోజకవర్గం నుంచి సిఎం ప్రారంభించారని, ఆ సభ కాంగ్రెస్ శ్రేణుల సభగా మారిందని విమర్శించారు. దళిత, గిరిజన, ఆదివాసీలకు ఆ సభలో సముచిత స్థానం ఇవ్వలేదని, తమ సమస్యలు చెప్పుకోవడానికి చెంచులకు అవకాశం ఇవ్వలేదు అని పేర్కొన్నారు.తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎంఎల్‌ఎ కోవా లక్ష్మి, మాజీ ఎంఎల్‌ఎ రేగా కాంతారావుతో కలిసి గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ హయాంలో ఆరు లక్షల మందికి ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చారని తెలిపారు. చెంచు పెంటలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత, బౌరాపూర్ చెంచు లక్ష్మి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్‌దే వ్యాఖ్యానించారు. 26 మందికి కెసిఆర్ హయంలోనే పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైందని, కానీ ఎన్నికల కోడ్‌తో ఆగిపోయిన పట్టాల పంపిణీని

సోమవారం రేవంత్ రెడ్డి పూర్తి చేశారని, కొత్తగా ఆయన చేసిందేమీ లేదని అన్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పేరును మార్చాలని సిఎం మంత్రులను సభ వేదిక మీద కోరారని, సిఎంకు మంత్రులకు సమన్వయం లేదని రేవంత్ రెడ్డి మాటలే రుజువు చేశారని పేర్కొన్నారు. సిఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో మాజీ గ్రామ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యారని, కొండారెడ్డి పల్లిలో కూడా రేవంత్‌కు ప్రజాదరణ లేదని అన్నారు. డిక్లరేషన్లు అలంకార ప్రాయంగా మారాయని, ఈ ప్రభుత్వం పని అయిపోయిందని ప్రజలు ఇప్పటికే డిక్లేర్ చేశారని విమర్శించారు. ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినా ఇక లాభం లేదని అన్నారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నట్టే దళిత, గిరిజన, ఆదివాసీలకు మోసపూరిత డిక్లరేషన్‌ను సిఎం ప్రకటించారని చెప్పారు. నల్లమలలో యురేనియం వెలికితీతను అడ్డుకున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కంపెనీకి నల్లమలలో ఖనిజ సంపదను తాకట్టు పెడితే బిఆర్‌ఎస్ అడ్డుకుందని, ఇప్పుడు రేవంత్ కన్ను మళ్లీ ఆ సంపదపై పడ్డట్టుందని అన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దిగివచ్చినా.. నల్లమల సంపదను తరలించుకు పోనివ్వం అని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News