Friday, May 23, 2025

పవన్ కళ్యాణ్ కు సరిపడేలా ’హరి హర వీరమల్లు’ ను తీర్చిదిద్దారు

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ’హరి హర వీరమల్లు’.(Hari Hara Veeramallu)ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ’హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా ’అసుర హననం’ విడుదలైంది. ఈ గీతాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు.

ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ గీతావిష్కరణ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ “హరి హర వీరమల్లు సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్)తో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలామంది దర్శకులను చూశాను. కానీ, తక్కువమందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. వేగంగా నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఎ.ఎం.రత్నంకి పేరుంది. లిరిక్ రైటర్ గా ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమా రూపంలో ఎ.ఎం.రత్నంకి మరో భారీ విజయం సొంతం అవుతుందని విశ్వసిస్తున్నాను.

పవన్ కళ్యాణ్‌ని మీరందరూ పవర్ స్టార్ అంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా ‘హరి హర వీరమల్లు’ను తీర్చిదిద్దారు”అని అన్నారు. చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి కల ఉంటుంది. అది ఒక అవార్డు గెలుచుకున్నట్టుగా ఉంటుంది. నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మొదట ఈ ప్రాజెక్ట్ కి పెద్ద పునాది వేసింది క్రిష్. దానిని పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని రత్నం ప్లాన్ చేశారు. ఇంత పెద్ద బాధ్యతను ఒలింపిక్ టార్చ్ లాగా క్రిష్ నాకు అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌ని, రత్నంని మెప్పించడం మామూలు విషయం కాదు. అలాంటిది ఆ ఇద్దరూ మెచ్చారంటే.. ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయి స్పందన సొంతం చేసుకోబోతుందో మీరే ఊహించుకోవచ్చు”అని తెలిపారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ “హరి హర వీరమల్లు సినిమా తయారవ్వడానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్. క్రిష్ చెప్పిన కథ నచ్చి, పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్ళాను. రత్నం జడ్జిమెంట్‌ను నమ్మి ఈ సినిమా చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. నా కుమారుడు అని చెప్పడం కాదు.. జ్యోతికృష్ణ ఈ సినిమా బాధ్యతను తీసుకొని ఎంతో కష్టపడి పని చేశాడు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయిక నిధి అగర్వాల్, రాంబాబు గోశాల, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News