పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. (Hari Hara Veeramallu) ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ’హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి మరో గీతం ’తార తార’ విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం చెన్నైలో ఘనంగా నిర్వహించింది. ‘తార తార’ గీతావిష్కరణ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే సంగీతంలో పవర్ కనిపించాలి. సంగీత విషయంలో జ్యోతికృష్ణ నాకెంతో స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించి.. ఎ.ఎం. రత్నంకి, జ్యోతికృష్ణకి సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ పోషించిన వీరమల్లు పాత్ర మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఉంటుంది. ‘హరి హర వీరమల్లు’కి పార్ట్ 2 కూడా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎం.రత్నం, నిధి అగర్వాల్, కె. ఎస్. రవికుమార్, నాజర్, సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.