కాళేశ్వరం కమిషన్ ఎదుట శుక్రవారం ఉదయం మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఒక నోట్ రూపంలో జస్టిస్ పిసిఘోష్‌కు అందజేశారు. విచారణ సందర్భంగా ఇతరులెవ్వరినీ కమిషన్ అనుమతించలేదు. విచారణ అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొని తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందజేసినట్లు చెప్పారు. పూర్తి సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపానల శాఖ కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శులకు లేఖ రాసినప్పటికీ వారి నుంచి స్పందన లేదని తెలిపారు. తనకు తెలిసినంత వరకు మేడిగడ్డ, అన్నారం,
సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయన్నారు. ఆరు సార్లు క్యాబినెట్ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు కమీషన్ కు అందించినట్లు తెలిపారు. అంతే కాకుండా మూడు సార్లు శాసన సభ ఆమోదం కూడా పొందిందన్నారు. లెజిస్టేచర్ అప్రూవల్ క్యాబినెట్ కంటే కూడా ఉత్తమం అని, ఆరు సార్లు క్యాబినెట్ అప్రూవల్ వివరాలు, మూడు సార్లు జరిగినఅసెంబ్లీ ఆమోదం, వాటి చర్చ వివరాలను కమిషన్ కు డాక్యుమెంట్లతో సహా అందజేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కు అందించిన సమాచారాన్ని తమకూ ఇవ్వాలని కోరితే ఇవ్వడం లేదని, పారదర్శకంగా ఉండాలనుకున్నప్పుడు తమకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదో అర్ధం కావడంలేదని ఆయన అన్నారు. కమిషన్ ను తప్పుదోవ పట్టించేలా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం తమకు ఉందనే అభిప్రాయాన్ని హరీష్‌రావు వ్యక్తం చేశారు.