Tuesday, July 29, 2025

సిగాచీ ఘటనపై అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిగాచీ పరిశ్రమ ఘటనపై అడుగడుగునా సర్కార్ నిర్లక్షం ప్రదర్శిస్తుందని, కంపెనీలో మృతిచెందిన బాధితులకు కోటి రుపాయలు అందజేస్తామని సిఎం రేవంత్ చెప్పినప్పటికీ ఇప్పటివరకు కొందరికి 15 లక్షలు, మరికొంత మందికి 10 లక్షలు , మరికొందరికి లక్ష రుపాయలు అందజేసి చేతులు దులుపుకున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. సోమవారం సిగాచీ కంపెనీ ప్రమాద బాధితుల పక్షాన సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసి మృతదేహలు అప్పగించడంలో నిర్లక్షంపై, పరిహారం ఇప్పటి వరకు అందించకపోవడంపై నిలదీశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిగాచీ కంపెనీ ఘటన జరిగి నెలరోజులవుతోందని, బాధితుల కుటుంబాలు కన్నీటి బాధతో నెలమాషికాలు చేసుకుంటున్నారన్నారు. సిఎం వచ్చి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి నెల రోజులైనా, ఇప్పటివరకు అందలేదన్నారు.

అంతిమ కార్యక్రమాలు జరపడానికి శవాలు కూడ ఇవ్వని దుస్థితి నెలకొందని, కుటుంబ సభ్యులు బూడిదను, మట్టిని తీసుకెళ్లి గోదావరిలో కలిపామని కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఇంత దారుణమైన ప్రమాదం చోటుచేసుకోలేదన్నారు. 54 మంది చనిపోతే ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని, బాధ్యతరహితంగా ఉందని మండిపడ్డారు. ఎక్స్‌గ్రేషియా, డెత్ సర్టిఫికెట్‌లు ఎప్పుడు ఇస్తారని బాధితులు అడిగితే ఎస్‌ఎల్‌బిసి ఘటనలో శవాలు కూడా బయటకు రాలేవని, మీకు బూడిదైనా దొరికిందని అత్యంత అవమానవీయంగా మాట్లాడుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. ఏపి, బీహార్, జార్ఖండ్ యుపి నుండి రావడానికి 30 వేల వరకు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారన్నారు. చాలా మంది ఆసుపత్రులలో వైద్యం పొందుతున్నారని, తీవ్రంగా గాయపడ్డవారికి సిఎం పది లక్షలు ఇస్తామని చెబితే, 50 వేలు ఇచ్చి చేతులు దులిపేశారన్నారు.

గాయడిపన వారందరికి 50 లక్షలు ఇవ్వాలని, నెలనెలా వేతనం ఇచ్చి బాధితులను ఆదుకోవాలని బిఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. చివరికి హై కోర్టులో సైంటిస్ట్ ఫర్ పీపుల్ స్వచ్ఛంద సంస్థ బాధితులకు పరిహారం ఇవ్వాలని పిటిషన్ వేసిందన్నారు. నెల గడిచినా ఎంత మంది చనిపోయారు…ఎంత మంది క్షతగాత్రులు ఉన్నారో అధికారికంగా వెల్లడించ లేదన్నారు. చనిపోయిన వారి పేర్లు, క్షతగాత్రుల పేర్లు అధికారకంగా ఎందుకు వెల్లడించడం లేదని, నష్టపరిహారం వివరాలు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన జగన్‌మోహన్ కొడుకు యశ్వంత్ ఇచ్చిన పిర్యాదులో సిగాచి కంపెనీలో పాత మిషన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశముందని అనేక సార్లు చెప్పినా కంపెనీ పట్టించుకోలేదన్నారు. యాజమాన్యం నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ యాజామాన్యం మీద ఎందుకు కేసు పెట్టలేదన్నారు. ఎఫ్‌ఐఆర్ కూడా అయిందని, సిఎం యాజామాన్యంతో కుమ్మక్కై వారిని కాపాడుతున్నారని విమర్శలు చేశారు. యాజామాన్యంతో సిఎంకు ఉన్నలాలూచీ ఎందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

శవాలు ఇవ్వకుండా 8మంది మిస్పింగ్ అంటూ ఎందుకు వేధిస్తున్నారని, వెంటనే డెత్ సర్టిఫికెట్‌లు ఇచ్చి ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కంపెనీ కూడా 15రోజుల్లో పరిహారం ఇస్తామని పత్రికా ప్రకటన చేసిందని, ఇప్పటికీ దిక్కులేకుండా పోయిందన్నారు. 2024లో అనకాపల్లిలోని ఒక కంపెనీలో ప్రమాదం జరిగి 17మంది చనిపోతే మూడు రోజుల్లో పరిహారం చెల్లించారన్నారు. సిగాచీ కంపెనీలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అసలు పరిహారం ఎవరు ఎక్కడ ఇస్తారో చెప్పాలన్నారు. సిఎం పట్టించుకున్న పాపాన పోవడం లేదని కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కరోనా సమయంలో వలస కార్మికులను కెసీఆర్ పట్టించుకున్నాడని, సిఎస్‌కు బాద్యతలు అప్పగించి జార్ఖండ్, యుపి, బీహార్ రాష్ట్రాలకు రైళ్లలో కార్మికులను పంపించాడన్నారు. వలస కార్మికులు తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములు అని వారికి ఎంతో గౌరవం ఇచ్చాడని, సిఎం రేవంత్‌రెడ్డి మాత్రం మృతదేహాలను అట్ట పెట్టెల్లో ప్యాక్ చేసి ఇచ్చిండని, ఇది సిఎం దుర్మార్గ అమానవీయ చరిత్ర అన్నారు.

గతంలో ఇలాంటి ప్రమాదం సంగారెడ్డి జిల్లాలో జరిగితే వారం రోజుల్లో ఎక్స్‌గ్రేషియా, సర్టిఫికెట్‌లు ఇంటికి వెళ్లి ఇచ్చామన్నారు. నెల గడుస్తున్నప్పటికీ సిఎం ఎప్పుడైనా సిగాచీ ఘటనపై సమీక్ష చేశాడా అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బిసి ఘటన జరిగి 150రోజులైనా శవాలు ఇంకా బయటకు రాలేవన్నారు. సిగాచీలో జరిగితే 8మంది శవాలు ఇవ్వలేదని బొక్కలు ఇవ్వలేదని, బూడిద ఇవ్వలేదన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో స్పందించడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సకాలంలో మంచి ఆసుపత్రులకు చేర్చితే ప్రాణాలు పోయేవి కావన్నారు. ఇప్పటికీ 14మంది ఆసుపత్రిలో ఉంటే 5గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఎస్‌ఎల్‌బిసి ఘటన జరిగితే హెలికాప్టర్లు వేసుకొని వెళ్లారని డెడ్ బాడీలను తీసుకురాలేదని, చేపలు బాగుంటాయని ఓ మంత్రి చేపల పులుసు తిన్నాడన్నారు. ఎస్‌ఎల్‌బిసి, సిగాచి కంపెనీ ఘటనలో ప్రభుత్వ బాద్యతరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎస్‌ఎల్‌బిసిలో 6మంది, సిగాచిలో 8మంది మృతదేహాలు ఏమయ్యాయన్నారు.

బాధితుల గోస వినిపించడం లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికైనా సిఎం కళ్లు తెరవాలని, బాధ్యత రహితంగా ఉండటం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే బిఆర్‌ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతాలకా్ష్మరెడ్డి, డిసిఎంఎస్ చైర్మెన్ శివకుమార్, మాజి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మఠం బిక్షపతి, కార్పోరేటర్ సిందు ఆదర్శ్‌రెడ్డి, పటాన్‌చెరు సమన్వయకర్త ఆదర్శ్‌రెడ్డి, జడ్‌పి మాజీ వైస్ చైర్మెన్ ప్రభాకర్, బిఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్‌గౌడ్, కొండల్ రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News