హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవట్లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. బనకచర్లపై ఎపి ప్రభుత్వం బలవంతంగా ముందుకెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..బనకచర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవులు మూసుకున్నాయని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని ఎపి మంత్రి నారా లోకేష్ అంటున్నారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, కేంద్రం చేతిలో ఉందన్న ధైర్యంతో ఎపి ప్రభుత్వం ఉందని ఎద్దేవ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు సిఎం, మంత్రులు ఎందుకు నోరు విప్పట్లేదు? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎపితో రేవంత్ సర్కార్ లోపాకారి ఒప్పందం చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాగు నీటి జలాలపై అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ను చూసుకునే లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం అడ్డుకునేందుకు ఎపి సిఎం చంద్రబాబు కేంద్రానికి ఏడుసార్లు లేఖలు (Seven letters Center) రాశారని తెలియజేశారు. ఎవరడ్డు వచ్చినా బనకచర్ల- గోదావరి ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం అని బనకచర్ల- గోదావరి ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసు అని అన్నారు. తాము ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొడుతున్నామని అంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో బాబ్లీ, ఆల్మటికి వ్యతిరేఖంగా గతంలో చంద్రబాబు కొట్లాడారని, గతంలో చంద్రబాబు కొట్లాడింది విద్వేషాలు రెచ్చగొట్టడానికేనా? అని హరీష్ రావు ప్రశ్నించారు.