Sunday, August 17, 2025

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తారా.. రైతులతో కలిసి వెళ్లి మమ్మల్ని చేసుకోమంటారా?

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తారా… లేకుంటే లక్షలాది రైతులతో కలిసి వెళ్లి మమ్మల్ని ఆన్ చేసుకోమంటారా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేరపూరిత నిర్ణయాలతో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందన్నారు. బిఆర్‌ఎస్‌పై బురద చల్లడానికే కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. రాజకీయాలు మాని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ప్రాజెక్టులను నింపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యంగా మారాయన్నారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదిలి పడావు పెడుతుందన్నారు.నంది మేడారంలో బటన్ నొక్కితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వస్తాయన్నారు.

నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది కానీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు తెలియదన్నారు. కెసిఆర్ రైతుబిడ్డ కాబట్టే నీటి విలువ తెలిసి ప్రతి నీటి బొట్టును వృధా చేయకుండా ప్రాజెక్టులు కట్టి ఒడిసిపట్టారని గుర్తు చేశారు.కృష్ణా,గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే రేవంత్ రెడ్డి కళ్లప్పగించి చూస్తున్నాడని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ మోటార్లను ఆన్ చేయకుండా కుట్రలు చేస్తుందన్నారు.వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు నింపితే యాసంగిలో లక్షల ఎకరాల పంట పండుతుందన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు మంత్రి ఉన్నాడా అని ప్రశ్నించారు. వెంటనే మోటార్లను ఆన్ చేసి రోజుకి రెండు టీఎంసీలు నీళ్లు మిడ్ మానేరుకు, అక్కడి నుండి మిగతా రిజర్వాయర్లకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం మోటార్లను కక్షపూరితంగా పనికిరాకుండా చేయాలని రోజుకు రెండుసార్లు ఆన్ ఆఫ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా చేస్తే మోటార్లు కాలిపోతాయని బీహెచ్‌ఈఎల్ చెప్పిన వినకపోవడం సిగ్గుచేటని అన్నారు.ఇవి ఇంట్లో ఉండే మోటార్లు కావని పదేపదే ఆన్ ఆఫ్ చేస్తే బెరింగ్లు చెడిపోయి మోటార్లు కాలిపోయే అవకాశం ఉంటుందన్నారు. దీంతో వేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు.శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62 వేల క్యూసెక్కుల వరద వస్తుందన్నారు. కడెం ప్రాజెక్టుకు లక్ష యాభై వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ పూర్తి వరద కడెం ప్రాజెక్టు నుండి శ్రీపాద ఎల్లంపల్లి కి వస్తుందన్నారు. నంది మేడారంలో కటక ఒత్తితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ మానేరులో పడతాయన్నారు. వారం రోజుల కిందనే ఈ విషయాన్ని ఉత్తంమ్ కుమార్ రెడ్డికి తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని పట్టించుకోవడం లేదన్నారు.అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉండడంతో పాటు చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టులు కట్టిన టీఎంసీ కంటే కెపాసిటీ కంటే చాలా తక్కువ టీఎంసీల నీళ్లు నిలువగా ఉన్నాయన్నారు. వెంటనే సరిపోయే టీఎంసీల నీళ్లను నింపాలన్నారు.ఈ రిజర్వాయర్‌లన్ని నింపితే యాసంగిలో లక్షల ఎకరాల్లో పంట పండుతుందన్నారు. ఈ వాన కాలంలో సగం సాగు కూడా కాలేదన్నారు.

నీటిని ఒడిసిపడితే యాసంగిలోనైనా పూర్తి పంట పండే అవకాశం ఉంటుందన్నారు. తాను రాజకీయాల కోసం ఇవన్నీ చెప్పడం లేదని రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గా పనిచేసిన అవగాహనతో చెబుతున్నానన్నారు. రోజు కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలయితుంటే గుడ్లప్పగించి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడడం తప్ప ఏం చేయడం లేదన్నారు. కేసీఆర్, హరీష్ రావు, మా పార్టీ నాయకులపై మీకు కోపం ఉంటే మాకు శిక్షించాలి తప్ప రైతులకు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.ఎస్సారెస్పీలో 61 టిఎంసిలు వచ్చాయన్నారు. అలాగే లక్ష 51 క్యూసెక్కుల వరద ఎస్సారెస్పీకి వస్తుందన్నారు. నీటిని విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం రైతులను గోస పెడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కరువు మొదలైందన్నారు. ఒకవైపు ఎరువుల కోసం గంటల తరబడి లైన్లో నిలబడి చెప్పులు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పంట పెట్టుబడి, రైతు బీమా,పంట బీమా, కరెంటు, సాగునీటి కోసం రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారన్నారు. అదే కేసీఆర్ పాలనలో రైతులు ఏ రోజు ఇబ్బందులకు గురి కాలేదని గుర్తు చేశారు.

కృష్ణా నదిలో హైడెల్ పవర్ ఉచితంగా ఉత్పత్తి అవుతుందన్నారు..జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ లో రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతదన్నారు.ఎమ్మార్పీ ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేయక పోవడంతో నల్గొండ జిల్లాకి నష్టం జరుగుతుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ లో గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు కానీ మోటర్లు ఆన్ చేసి నీళ్లను ఒడిసిపట్టడం లేదన్నారు. కల్వకుర్తిలో మూడు మోటర్లు నడపవలసి ఉంటే కేవలం ఒక్క మోటార్ మాత్రమే నడుపుతున్నారన్నారు.దేవాదులలో ఐదుగురు మంత్రులు వెళ్లి ఫేస్ 3 ప్రారంభించారని ఇప్పటికీ దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించాడు.వరంగల్ జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే కల్వకుర్తి మోటార్ ఆన్ చేయక మహబూబ్‌నగర్ జిల్లాకి నష్టం చేకూరుతుందన్నారు.కాళేశ్వరం మోటార్ ఆన్ చేయకుంటే ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు నష్టం జరుగుతుందన్నారు.

కాంగ్రెసోళ్లు కమిషన్ల కోసం పనిచేయడం మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు రాజనర్సు, రాధాకృష్ణ శర్మ, సంపత్ రెడ్డి, సోమిరెడ్డి, మాణిక్య రెడ్డి, భూపేష్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీహరి యాదవ్, రమేష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News