కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే తెలంగాణ వ్యాప్తంగా యూరియా సమస్య నెలకొందని మాజీమంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవపూర్ గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎరువుల కోసం క్యూలో నిలబడిన రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితి కల్పించిన ఘనత కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌లకే దక్కుతుందని మండిపడ్డారు. చేతగాని ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రైతులకు యూరియా అందడం లేదని మండిపడ్డారు. రైతులకు అరిగోస పెడుతున్న బిజెపి, కాంగ్రెస్‌కు తప్పకుండా రైతుల ఉసురు తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. 8 మంది బిజెపి ఎంపిలు గెలిచినా రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదన్నారు. 4 రోజుల నుండి వ్యసాయ పనులు వృధా చేసుకొని రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని అన్నారు.
రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బిజెపిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ముఖ్యమ్రంతి రేవంత్ రెడ్డి 51సార్లు ఢిల్లీకి పోయాడు కానీ ఎరువుల కొరత ఎందుకు తీర్చలేకపోయాడని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన సొంత పార్టీ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సిఎం తిట్లకు ఎక్కువ పని.. తక్కువ అని విమర్శలు చేశాడని గుర్తు చేశారు. ప్రజలకు కావాల్సింది తిట్లు కాదు సంక్షేమం, అభివృద్ధి అని అన్నారు. రేవంత్ రెడ్డికి తిట్లపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదన్నారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు లేని ఎరువుల సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రైతులకు సాగునీరుతో పాటు ఉచితంగా ఎరువులు ఇచ్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. కెసిఆర్ పాలనలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని..కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో వారికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ పాత కాలం నాటి సమస్యలు ఎదురయ్యాయని స్పష్టం చేశారు. యూరియా కోసం ఒటిపి, ఒక్క బస్తా విధానాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ సూచించారు.
పంటలు ఎప్పుడు వేసుకోవాలి ఎలా పండించుకోవాలన్న ఆందోళనలో రైతులు ఉన్నారని అన్నారు. కెసిఆర్ హయాంలో హమాలీల ఖర్చులు ఇచ్చి ఇంటికే యూరియాను పంపించారని గుర్తు చేశారు. నానో యూరియాతో రైతులకు ఎకరానికి 500 రూపాయలు భారం పడుతుందని అన్నారు. ప్రభుత్వం సబ్సిడీ నుండి తప్పించుకోడానికి కృత్రిమ ఎరువులను సృష్టిస్తోందని అన్నారు. ఎన్నికలు ఉన్నాయని బీహార్‌కు ఎరువులను తరలించడం సరికాదన్నారు. ఉదయం నుండి యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడ్డ రైతులు మాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతుల అవసరాల అనుగుణంగా ఎరువుల బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు మారెడ్డి రవీందర్ రెడ్డి, ప్రభాకర్ వర్మ తదితరులు ఉన్నారు.