రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు కంటి నిండా నిద్ర లేకుండా పోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా, నంగునూరు మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూరియాపై రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడంతో రాష్ట్రంలో యూరియా సమస్య తలెత్తిందని అన్నారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ యూరియాపై ఎందుకు లేదని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో రైతులకు యూరియా సమస్య లేకుండా చేశామని గుర్తు చేశారు. కెసిఆర్ గోదావరి జలాలను తెచ్చి రైతుల పాదాలను కడిగారన్నారు. అదే రేవంత్ రెడ్డి యూరియా కోసం వచ్చిన రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్న బడే భాయ్ నరేంద్ర మోడీ, చోటే బాయ్ రేవంత్ రెడ్డి రైతులకు ఏం న్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు.కాంగ్రెస్, బిజెపి పాలనలో ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. యూరియా కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆ రెండు పార్టీల ఎంపిలు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరిట రైతుల ఉసురు పోసుకుంటోందన్నారు. యూరియా సరఫరా చేయని కాంగ్రెసోళ్లకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతాంగానికి ఎన్నెన్నో ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమస్యలు మొదలయ్యాయని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో కెసిఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌కు ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు అన్నారు. 51 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. వడ్లు అమ్మి మూడు నెలలు గడుస్తున్నా రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా యూరియాను వెంటనే సరఫరా చేయాలని లేకుంటే రైతులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కోలా రమేష్ గౌడ్, గుండు భూపేష్, దువ్వల మల్లయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.