ఉన్న కుర్చీ లాగకుండా
చూసుకోండి రేవంత్‌రెడ్డికి
నిలువెల్లా విషం
15నెలల్లో ఆగని
పథకం ఏదైనా
ఉందా? : హరీశ్‌రావు
సిఎం రేవంత్ రెడ్డి బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉంటా అని పగటి కలలు కంటున్న రేవంత్ రెడ్డి, ఉన్న మూడేళ్లు ఆయన కుర్చి సక్కగ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఏ పక్క నుంచి ఎవరు వచ్చి లాక్కుంటరో చూసుకోవాలని అన్నారు. పదో తరగతి ఫలితాల విడుదలను కూడా రేవంత్‌రెడ్డి తన రాజకీయ అవసరానికి వాడుకున్నారని మండిపడ్డారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి స్థాయిని, హోదాను దిగజార్చారని ధ్వజమెత్తారు.
బిఆర్‌ఎస్ రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్‌కు నిద్ర పట్టడం లేదు అని హరీష్‌రావు అన్నారు. కళ్లలో, కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నారని, కడుపులో పెట్టుకున్న విషాన్ని, ఆపుకోలేక బయట కక్కిండు అంటూ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా?
రాష్ట్రంలో ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలి సిఎం అంటున్నారని, కెసిఆర్ కిట్టు ఆగిపోలేదా..దళిత బంధు ఆగిపోలేదా..బిసి బంధు ఆగిపోలేదా… గొర్రెల పంపిణీ ఆగిపోలేదా… రెండు నెలల పింఛన్లు ఆగలేదా.. డబుల్ బెడ్ రూం ఇళ్లులు ఆగలేదా.. స్కాలర్‌షిప్పులు ఆగలేదా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగలేదా..అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా..? అని అడిగారు.
సిఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని హరీష్‌రావు ప్రకటించారు. సిఎం అన్నట్లు కాళేశ్వరం మీద చర్చ పెడుదామా..? రుణమాఫీ మీద పెడుదామా… రైతు బంధు మీద పెడుదామా.. బోగస్ 60 వేల ఉద్యోగాల మీద పెడుదామా, కులగణన మీద పెడుదామా..? అని ప్రశ్నించారు. దేని మీదైనా తాను చర్చకు సిద్దం అని, ప్లేస్, టైం ఆయనే చెప్పాలంటూ సవాల్ విసిరారు. రుణమాఫీ మీద చర్చ అని ఇప్పటికే తోకముడిచారని, ఇప్పుడు కూడా అలా చేసి తప్పించుకోకుండా పదేళ్లు అధికారంలో ఉంటా అని పగటి కలలు కంటున్న రేవంత్ రెడ్డి, ఉన్న మూడేళ్లు ఆయన కుర్చి సక్కగ ఉండేలా చూసుకోవాలని సూచించారు.