పాలన గాలికి వదిలి, సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఒక్కటే అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యంపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం ధరలు పెంచి వేల కోట్ల రాబడిని సమకూర్చుకోవాలనుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచి, పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదని అన్నారు. ఒకవైపు మద్యం ధరలు పెంచడం, మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వం అంతర్యం స్పష్టమవుతున్నదని తెలిపారు. ఎన్నికల ముందు సుద్ద పూస మాటలు, అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు..దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేసి రాష్ట్ర పరపతిని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనాలోచిత నిర్ణయాలు, దుందుడుకు చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతి రోజు రోజుకి క్షీణిస్తుండగా, ఆ లోటును భర్తీ చేసుకునేందుకు మద్యం ధరలు పెంచడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. అభయహస్తం 29వ పేజీలో..ప్రస్తుత ఎక్సయిజ్ విధానాన్ని పునః పరిశీలించి పాలసీలో అవసరమైన సవరణలు చేస్తామని, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని అన్నారని గుర్తు చేశారు. మద్యం నియంత్రణ విషయంలో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క హామీ అయినా ఇప్పటి వరకు అమలు చేసారా..? అని ప్రశ్నించారు. ఎక్సైజ్ విధానాన్ని పరిశీలించి, సవరణలు చేయడం అంటే ధరలు అడ్డగోలుగా పెంచడమేనా..? అని ముఖ్యమంత్రిని నిలదీశారు. ఇష్టారీతిన మద్యం ధరలు పెంచి, తాగుబోతుల ద్వారా ఖజానా నిలుపుకోవాలని చూస్తారా..? అని అడిగారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తారా..మీరు చెబుతున్న తెలంగాణ రైజింగ్ అంటే ఇదేనా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు మూస్తామని హామీ ఇచ్చి, గల్లి గల్లీలో బెల్ట్ షాపు తెరిచి తాగుబోతుల తెలంగాణగా మార్చే కుట్ర కాంగ్రెస్ చేస్తున్నదని మండిపడ్డారు.
ఒకవైపు ఎక్సైజ్ ద్వారా ప్రజల నుంచి డబ్బును ముక్కు పిండి వసూలు చేస్తూ, మరోవైపు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. ఇచ్చేది ఎగబెడుతున్నరు… ఉల్టా ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటున్నారని పేర్కొన్నారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే.. ఇంకెన్ని సార్లు మద్యం ధరలు పెంచుతారు.. ఇంకెన్ని కోట్లు ప్రజల నుండి దండుకుంటారు…? అని ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లు సర్కారు గల్లా పెట్టె ఫుల్లుగా నింపుకోవాటానికి గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలో మీటర్లకు ఒకటి చొప్పున 100కు పైగా మైక్రో బ్రూవరీల ఏర్పాటు చేస్తున్నారని, ఇంతకంటే దిగజారుడు, దిక్కుమాలిన పాలన ఎక్కడైనా ఉంటుందా..? అని అడిగారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి, భార్యా పిల్లలను రోడ్ల మీద పడేస్తారా.. యువత బతుకులను ఆగం చేస్తారా..అని ప్రశ్నించారు. అసలు ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నదని హరీష్‌రావు నిలదీశారు.